హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : కులగణనను సత్వరమే చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ హోటల్ అశోకాలో ఆదివారం అఖిలపక్ష పార్టీలు, కుల, బీసీ సంఘాలతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్లు పెంచాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షలు, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్లపై చర్చించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమానికి అన్ని పార్టీలు, బీసీ కుల, ఉద్యోగ సంఘాల నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.