హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గురుకులాల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 650 గురుకుల పాఠశాలల భవనాల కిరాయిలు పదినెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈనెల 12లోపు అద్దెలు చెల్లించకపోతే భవనాలకు తాళాలు వేస్తామని యజమానులు హెచ్చరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లోని భవన కిరాయిలు రూ.215 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు ఎంతో ఆసరా నిలుస్తున్నాయని, అలాంటి వాటిపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకులాలకు నిధులు కేటాయించి.. సొంత భవనాలను నిర్మించాలని వారు కోరారు.
రేపు, ఎల్లుండి ఐసెట్ పరీక్ష
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ పరీక్ష ఈనెల 8, 9 తేదీల్లో (ఆదివారం, సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎగ్జామ్ సెంటర్ల గేట్లను పరీక్షకు 15 నిమిషాల ముందే క్లోజ్ చేస్తామని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు. రెండు రోజుల్లో మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే మూడో సెషన్‌తో పరీక్షలు ముగుస్తాయని వెల్లడించారు. ఉదయం సెషన్లో 9:45కు, మధ్యాహ్నం సెషన్లో 2:15 గంటలకే సెంటర్ల గేట్లు మూసేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జోన్లలో 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సారి మొత్తం 71,757 మంది ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.