హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలోని 12సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్ కళాశాలలను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గురువారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వందలాది మంది పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్, జేఈఈ, ఎప్సెట్ ఫలితాల్లో గురుకుల ఇంటర్ విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలతో పోటీపడి ర్యాంకులు సాధించారని గుర్తుచేశారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టలేని ప్రభుత్వం.. ఎస్సీ గురుకుల ఇంటర్ కళాశాలలను మూసి వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గురుకుల కళాశాలలు పేద విద్యార్థులకు ఎంతో బాసటగా నిలుస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం కళాశాలల ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.