హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోని ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిషరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాల విద్య అడిషనల్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డిని కలిసి మణికంఠరెడ్డి, లక్ష్మణ్ కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక పాఠశాలలో టీచర్ల కొరత ఉన్నందున విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా ప్రణాళికలు రూపొందించాలని, మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజుల పేరిట వేల రూపాయలు వసూలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఈ టెక్నో, వరల్డ్, ఒలింపియాడ్ తదితర పేర్లతో ప్రచారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేశ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి అనిల్, చైతన్య యాదవ్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగులపై టీజీపీఎస్సీ ఆర్థిక భారం : ఏఐవైఎఫ్
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇటీవల విడుదల చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లలో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును విపరీతంగా పెంచిందని, పెంచిన ఫీజును వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)డిమాండ్ చేసింది. శుక్రవారం ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నాంపల్లిలోని టీజీపీస్సీసీ కార్యాలయంలో అదనపు కార్యదర్శి సరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో ఉన్న అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కు పెంచినది పేర్కొన్నారు. ఒకేసారి 400 శాతం పెంచడం సరికాదని తెలిపారు. నిరుద్యోగ యువతపై ఆర్థిక దాడిగా మారిన ఫీజుల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.