AIIMS | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను వీడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2022-24 మధ్య కాలంలో దేశంలోని 20 ఎయిమ్స్‌లకు చెందిన 429 మంది వైద్యులు రాజీనామా చేసినట్టు కేంద్రమంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ పార్లమెంటుకు తెలిపారు. ఎంపీ రామ్‌జీ లాల్సుమన్ అడిగిన ప్రశ్నకు ప్రతాప్రావు బదులిస్తూ ఈ వివరాలు వెల్లడించారు.
అత్యధికంగా ఢిల్లీ ఎయిమ్స్‌ను 52 మంది వైద్యులు వీడగా, తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌ను ఈ మూడేండ్లలో 19 మంది వీడినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 20 ఎయిమ్స్లలోప్రతి మూడు అధ్యాపకుల పోస్టులకు ఒకటి ఖాళీ ఉన్నట్టు వెల్లడించారు. వైద్యులు వరుసగా ఎయిమ్స్‌లను వీడుతుండటంతో రిటైర్డ్ ఫ్యాకల్టీని నియమించుకునేందుకు చర్యలు చేపడతామని కేంద్రమంత్రి ప్రకటించారు. వైద్య విద్య బోధనకు అతిథి అధ్యాపకులను నియమించే విషయంలో కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో ఇతర సిబ్బంది కొరత సైతం ఉందని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తెలిపింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో 1,306 సిబ్బంది ఉండాల్సి ఉండగా, 462 ఖాళీలు ఉన్నట్టు తెలిపింది. భోపాల్ ఎయిమ్స్‌లో 71, భువనేశ్వర్‌లో 103 ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఎయిమ్స్‌లో 20-35 శాతం వరకు సిబ్బంది కొరత ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇందులో నర్సులు సహా ఇతర విభాగాల్లో కీలక సిబ్బంది పోస్టులు సైతం ఖాళీగా ఉన్నట్టు వివరించింది.
ఇటీవల దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నట్టు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రకటించారు. తాజాగా ఎయిమ్స్‌లను డాక్టర్లు వీడుతున్నట్టు పార్లమెంట్లో కేంద్రం ప్రకటించడంతో వైద్య రంగంపై బీజేపీ నిర్లక్ష్యం స్పష్టమవుతున్నది. ఇక ఎయిమ్స్ నుంచి వైద్యులు వీడుతున్న రాష్ర్టాల్లో బీజేపీ పాలిత రాష్ర్టాలే అధికంగా ఉన్నాయి. ఢిల్లీలో 57, ఉత్తరాఖండ్‌లో 38, ఛత్తీస్‌గఢ్‌లో 35, ఉత్తరప్రదేశ్‌లో 29, మధ్యప్రదేశ్‌లో 27, రాజస్థాన్‌లో 25 మంది వైద్యులు ఎయిమ్స్‌లను వీడారు.
ఎయిమ్స్‌లలో మౌలిక వసతులు కల్పించడంలో కేంద్రం విఫలం కావడం ఈ పరిణామాలకు కారణమవుతున్నది. దీంతోపాటు ఎయిమ్స్‌లలో పనిచేస్తున్న వైద్యులకు ప్రైవేటు రంగంలో పదింతలు జీతం అధికం ఉండటం కూడా వైద్యులు తమ ఉద్యోగాలను వీడటానికి కారణమవుతున్నది. తెలంగాణలో ఎయిమ్స్ ఘనత మాదే అని చెప్పుకునే బీజేపీ నేతలు ఎయిమ్స్‌లో నెలకొన్న సమస్యలను కనీసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. కేంద్రం ఇప్పటికైనా చొరవ చూపి ఎయిమ్స్‌లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.