Congress | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా ఎందుకు వచ్చాయి?. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 8 సీట్లు గెలిస్తే, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ కూడా 8 సీట్లు ఎలా గెలుచుకున్నది. తప్పు ఎక్కడ జరిగింది?’ అని కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ నాయకత్వాన్ని నిలదీసినట్టు తెలిసింది. రాష్ట్ర ముఖ్యనేతలు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జీలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని అధిష్ఠానం ఆదేశించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 17 ఎంపీ సీట్లలో కనీసం 12 గెలుస్తామని అంచనా వేస్తే, 8 సీట్లే గెలువడం ఏమిటని అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈ వర్గాల సమాచారం.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా కాకుండా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన మంత్రులు సీరియస్‌గా తీసుకోలేదా? కారణం ఏవైనా.. అన్ని కోణాల నుంచి నివేదిక ఇవ్వాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోరినట్టు తెలిసింది. అలెప్పీ (కేరళ) నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచిన కేసీ వేణుగోపాల్ మంగళవారం అక్కడి నుంచే ఫోన్లో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడినట్టు సమాచారం. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడుగురు పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం తమను విస్మయ పరిచిందని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్‌తో పాటు సీఎం సిట్టింగ్ సీటు మల్కాజిగిరిలో పార్టీ ఓటమి తమను అమితంగా ఆశ్చర్యపరిచిందని ఆయన వ్యాఖ్యానించారని చెప్తున్నారు.
అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగకపోవడం వల్లనే చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, కరీంనగర్లో పార్టీ ఓడిపోయిందని ఒకరిద్దరు నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనిపై పార్టీ ఇన్చార్జి నుంచి నివేదిక అందాక తానే స్వయంగా అక్కడికి వచ్చి సమీక్షిస్తానని కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకపోవడానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడమే కారణమని పీసీసీ అధినేత, సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి సంజాయిషీ ఇచ్చినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగినప్పటికీ, బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడం వల్లనే ఆశించిన ఫలితాలను సాధించలేకపోయామని ఆయన వివరించినట్టు సమాచారం.
తన వాదనను గట్టిగా సమర్ధించుకునేందుకే పార్లమెంట్ ఫలితాలపై ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఇదే అంశాన్ని వివరించి ఉంటారని సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధిష్ఠానం దృష్టికి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా, ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందనే వాదన బలపడకుండా ఉండేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్మీట్లో బీఆర్ఎస్-బీజేపీలు ఏకమై కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయన్న వాదనను బలంగా వినిపించి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.