రఘునాథపాలెం, ఏప్రిల్ 27 : ఎరువు లు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగ్రో డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దుకాణాలు మూసి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గౌరిశెట్టి మునీందర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. రైతులకు రాయితీపై అందించే ఎరువులతోపాటు రాయితీలేని లేదా లింక్ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయా కంపెనీలు డీలర్లను బలవంతం చేస్తున్నాయని.. దీంతో క్షేత్రస్థాయి లో డీలర్లు రైతుల నుంచి ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
విత్తనాలు మొలకెత్తకపోతే డీలర్‌ను బాధ్యుడిని చేయడం సరికాదని చెప్పారు. దాడుల నుంచి రక్షించడానికి చట్టపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డీలర్ పాయింట్ వరకు ఉచిత రవాణా చేయాల్సి ఉండగా రవాణా ఖర్చులను డీలర్లపై వేస్తున్నారని ఆరోపించారు.
డీలర్ మార్జిన్‌ను 8 శాతానికి పెంచాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా యారియా యాప్‌ను అమలుచేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే దానిని తొలగించాలని, ఎరువులు ధరలు తగ్గించాలని కోరారు.