హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : ఎరువుల షాపుల ముందు వ్యవసాయ శాఖ కుర్చీలు వేయిస్తున్నది.. టెంట్లు ఏర్పాటు చేస్తున్నది! అయితే ఇదంతా రైతులపై ప్రేమతో అనుకునేరు.. కాదు కాదు.. రైతుల క్యూలు కనిపించకుండా చేసే తండ్లాట! యూరియా కొరతతో రైతులు ఎరువుల షాపుల ముందు బారులు తీరుతున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. దీంతో ఎరువుల షాపుల ముందు రైతుల క్యూలైన్లు కనిపించకుండా చేసేందుకు వ్యవసాయ శాఖ నానా తంటాలు పడుతున్నది. ఇందులో భాగంగానే ఎరువుల షాపుల వద్ద కుర్చీలు వేయాలని, టెంట్లు వేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ప్రతి షాపు ముందు కచ్చితంగా ఈ ఏర్పాట్లు ఉండాలని ఆదేశించినట్టు సమాచారం.
యూరియా కోసం వచ్చిన రైతులను క్యూల్లో నిల్చోనివ్వకుండా కుర్చీలో కూర్చోబెట్టాలని సూచించినట్టు తెలిసింది. ఈ విధంగా రైతులకు యూరియా కొరత తీర్చకుండా కుర్చీలు వేసి మాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వానకాలంలో యూరియా కోసం రైతుల పడిన తిప్పలు వర్ణణాతీతం. ఈ యాసంగిలోనూ అదే పరిస్థితి. సీజన్ ప్రారంభంకాకముందే యూరియా కొరత మొదలైంది. ఎక్కడ చూసినా షాపుల ముందు రైతులు ఉదయం 4, 5 గంటల నుంచే గడ్డకట్టే చలిలో క్యూ కడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ పరిస్థితులు సర్కార్కు ఇబ్బందికరంగా మారాయి. రైతులు, ప్రజల్లో వ్యతిరేకతను సృష్టిస్తున్నాయి. దీంతో కుర్చీలు, టెంట్ల ఆలోచన చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.