Bandi Sanjay | హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతున్నట్టు చర్చ సాగుతున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో సంజయ్‌ని పిలిపించుకొని మాట్లాడారు. దీంతో కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సంజయ్‌కి క్లాస్ పీకేందుకే పిలిపించారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయనను ఓదార్చేందుకే అమిత్ షా పిలిపించుకున్నారని, కీలక పదవిపై హామీ ఇచ్చారని మరో వర్గం నేతలు ప్రచారం మొదలుపెట్టారు.
దీనికితోడు ఇటీవల ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. సంజయ్ పనితీరును మోదీ మూడుసార్లు మెచ్చుకున్నారని, దీంతో ఆయనకు మంచి పదవి దక్కుతుందని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత సంజయ్ ఇప్పటికే మూడునాలుగుసార్లు ఢిల్లీలో పెద్దలను కలిశారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్రంలో మరో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నదన్న చర్చ జోరుగా సాగుతున్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నిర్వహణ కమిటీ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు అప్పగించిన బీజేపీ అధిష్ఠానం.. అదే తరహాలో కొత్తగా ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటుచేసి దాని బాధ్యతలను సంజయ్‌కి అప్పగించనున్నదన్న గుసగుసలు మొదలయ్యాయి. దీంతో మళ్లీ ఈటల వర్సెస్ బండిగా పరిస్థితి మారుతుందని పలువురు బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వారి అంతర్గత పోరుతో పార్టీ కుప్పకూలిపోయిందని, ఎన్నికల వేళ మరోసారి అలాంటి పరిస్థితితే వస్తే బీజేపీలో ఒక్కరు కూడా మిగలరని చెప్పుకొంటున్నారు.