కామారెడ్డి: దేశంలో ఈ పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినన్ని ప్రజా సంక్షేమ పథకాలను మరే పార్టీ చేపట్టలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. తాను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశానని, కార్మికుల సాధకబాధకాలు తనకు బాగా తెలుసని అన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని, కాని ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నదని తెలిపారు. ఇవాళ కామారెడ్డిలో నామినేషన్ వేసిన సీఎం.. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.
‘నేను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన. దేశంలో మొత్తం 16 రాష్ట్రాల్లో బీడీలు చేసేటోళ్లు ఉన్నరు. ఒక్క తెలంగాణలో తప్ప ఏ రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడంలేదు. ఇప్పటిదాకా 2014 ఏడాదికంటే ముందే బీడీ కార్మికులుగా ఉన్న వాళ్లకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నం. 2014 తర్వాత బీడీ కార్మికులుగా మారిన వాళ్లకు పెన్షన్లు రావడంలేదు. అందుకే కొత్త బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇయ్యాలె అనే విషయాన్ని మా ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నా దృష్టికి తెచ్చిండ్రు. ఎన్నికల తర్వాత పాత, కొత్త తేడా లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి పెన్షన్ వస్తుంది. ఇది నా హామీ’ అని సీఎం చెప్పారు.
‘సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం మొత్తం నాశనం పట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత తండ్లాడి వ్యవసాయాన్ని గాడిన పెట్టుకున్నం. కరెంటు వెలుగు జిలుగులు సాధించినం. 24 గంటల కరెంటు ఇచ్చుకుంటున్నం. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. రైతుబంధు నిజంగా దుబారానేనా..? మరె ఇట్ల మాట్లాడెటోళ్లను ఏమనాలె…? రైతుబంధు కొనసాగాలంటే ఏం చెయ్యాలె..? బీఆర్ఎస్ పార్టీ గెలువాలె. అందుకే ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించి వేయాలె’ అని సూచించారు.
‘ఇప్పుడు ఒక్కో ఎకరానికి రెండు విడతల్లో కలిపి ఏడాది రూ.10 వేల రైతు బంధు వస్తున్నదని, ఎన్నికల తర్వాత రైతుబంధు పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలకు పెంచబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీల ఇంకొకాయన 24 గంటల కరెంటు వేస్ట్ అంటున్నడు. కేసీఆర్ ఏం పనిలేక కరెంటును వృథా చేస్తున్నడు అంటున్నడు. 3 గంటల కరెంటు చాలు అంటున్నడు. నిజంగా 24 గంటల కరెంటు వృథానా..? కేవలం 3 గంటల కరెంటు సరిపోతదా..? మరె ఇట్లాంటి మాటలు మాట్లాడెటోళ్లను ఏం చెయ్యాల్నో తెలుసా..? ఓటుతో బుద్ధి చెప్పాలె. ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు. దాన్ని కరెక్టు వాడుకోవాలె’ అని సీఎం చెప్పారు.