హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హనుమకొండ జిల్లా కేంద్రాల్లోని 176 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు. వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు నిరుడు సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో అత్యధికంగా ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లో 360, మిషన్ భగీరథలో 302 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం 1,540 ఉద్యోగాలకు 81,571 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, 74,192 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగనున్నది. ఉదయం 8.30 నుంచి 9.45గంటల వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 2.15గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. బబ్లింగ్ సమయంలో తప్పులు చేయొద్దని, ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచిస్తున్నది.
హాల్‌టికెట్‌లోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. హాల్ టికెట్లో ఫొటో ప్రింట్ కాకపోయినా, బ్లర్ అయినా, ఫొటో చిన్నగా వచ్చినా మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై గెజిటెడ్ అధికారితో సంతకాలు తీసుకోవాలని, పరీక్షకు గంట ముందే సెంటర్ సూపరింటెండెంట్‌ను సంప్రదించాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఐడీ కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు.