హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో అతనొక ముఖ్యనేత. అందరూ గౌరవించాల్సిన పదవిలో ఉన్నా.. అతని ఆలోచనంతా ‘కల్తీ’ మయం. తన అనుచరులతో చేస్తున్న కల్తీ కల్లు గలీజు దందా అంతా ఇంతాకాదు. అతనితోపాటు హైదరాబాద్‌కు చెందిన కొందరు బీగ్రేడ్ కాంగ్రెస్ నాయకులు.. సంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌కు చెందిన ఏ గ్రేడ్ కాంగ్రెస్ నేతలంతా కలిసి.. పెద్ద నెట్‌వర్క్‌గా ఏర్పడి ఈ కల్తీకల్లు దందా నిర్వహిస్తున్నట్టు ‘నమస్తే తెలంగాణ’ పరిశోధనలో వెల్లడైంది. తాటిచెట్టు నుంచి లభించే కల్లు చుక్క కూడా లేకుండా.. మత్తు పదార్థాలతోనే రోజూ వేల లీటర్ల వ్యాపారం చేస్తున్నారని తెలుస్తున్నది. సొసైటీలు, కల్లుగీత కార్మికుల సభ్యత్వాలను అడ్డుపెట్టుకొని, రాష్ట్రంలో ఎక్కడికి సరుకు పంపాలి? ఎలా పంపాలి? ఏ స్థాయిలో పంపాలో.. పక్కా ప్లాన్‌తో ఎక్సైజ్ అధికారులను ‘మేనేజ్’ చేస్తున్న కల్తీ కల్లు నెట్వర్క్… మాఫియాను తలపిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌లో నెట్వర్క్ మొత్తాన్ని హైదరాబాద్ సమీప జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత కనుసన్నల్లోనేజరుగుతున్నదని పలు గౌడ సంఘాల నేతలు చెప్తున్నారు. ఎక్సైజ్ అధికారులతో కలిసి బెదిరించడంతోపాటు, కల్తీకల్లు తయారు చేసే వారికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా బాధ్యతను కూడా ఈ నెట్వర్క్ తీసుకుంటున్నదని విశ్వసనీయ సమాచారం. ఒక్క హైదరాబాద్ సమీప జిల్లాలోని మూడు మండలాల్లోనే అతని అనుచరులు రోజుకు రూ.3-4 లక్షల వ్యాపారం చేస్తున్నారని గౌడ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇటీవల ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ నివేదికలోని వివరాల ప్రకారం లైసెన్స్ కలిగిన కల్లు దుకాణాలు 8,238 ఉన్నాయి. వీటిలో టీసీఎస్‌లు (సొసైటీలు) 3,824 ఉండగా.. వ్యక్తిగత లైసెన్స్‌లు (టీఎఫ్టీ)లు 4వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 2,25,000 మంది వృత్తిదారులు ఆధారపడగా.. అనధికారికంగా వీరి సంఖ్య లక్షల్లోనే ఉంది.
హైదరాబాద్, రంగారెడ్డి లాంటి జిల్లాలో 200 కల్లు దుకాణాలు ఉన్నాయి. తాటిచెట్టుపై కల్లు తీసి, ఆ చెట్టుకిందనే విక్రయించుకోవడానికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. ఆ లెసెన్సును ఆధారంగా చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా కల్లు తయారీ కేంద్రాల నుంచి తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మన రాష్ట్రంలో కల్లుకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఈ కల్తీ కల్లు తయారీ కేంద్రాలు అధికంగా విస్తరించాయి. లెకకు మించి లైసెన్స్‌లు మంజూరు చేస్తున్న ఎక్సైజ్‌శాఖ తనిఖీలు చేయట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ శివారు ప్రాంతాల్లో కల్లు తయారు చేసే స్థావరాలు పుట్టగొడుగుల్లా పెరిగాయని స్థానికులు చెప్తున్నారు.
లిక్విడ్ ప్రయోగం వికటించడం వల్లే!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఆరుగురిని బలి తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. కూకట్పల్లి, హైదర్‌నగర్, ఇందిరానగర్, శంషీగూడలోని కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ కల్లు కాంపౌండ్లకు ప్రముఖ కాంగ్రెస్ నేత నెట్వర్క్ నుంచి వచ్చిన మత్తు పదార్థాలే కారణమని తెలుస్తున్నది. ఇటీవల పౌడర్‌గా లభించే క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), డైజోపామ్, ఆల్ఫ్రాజోలంను లిక్విడ్‌గా మార్చి సరఫరా చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌడర్‌గా ఉన్నవాటిని జెల్గా లేదా లిక్విడ్‌గా మార్చితే వాటి డోస్ రెట్టింపు అవుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఈ క్రమంలో సదరు నెట్వర్క్ ప్రయోగాత్మకంగా పౌడర్ నుంచి లిక్విడ్‌గా మార్చి హైదరాబాద్‌లోని కూకట్పల్లి, ఎల్బీనగర్, ఎల్లమ్మబండ, హైదర్‌నగర్, ముషీరాబాద్, రాంనగర్, ఉప్పల్, నారాయణగూడ, కర్మన్‌ఘాట్ బస్తీల్లోని కల్లు కాపౌండ్లకు ఓ కాంట్రాక్టర్ పంపినట్టు తెలిసింది. కూకట్‌పల్లిలో ప్రయోగం వికటించడం, కల్తీకల్లు తాగినవారు చనిపోవడంతో వెంటనే మిగతా కేంద్రాలకు పంపిన కల్లును ధ్వంసం చేశారని విశ్వసనీయ సమాచారం. గీత కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన నాయకులే, వారిని వాడుకుంటూ, వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ అక్రమ వ్యాపారాలకు పాల్పడటం విమర్శలకు తావిస్తున్నది. ఎక్సైజ్ అధికారులు కూడా ఈ అక్రమ దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని గౌడ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.