హైదరాబాద్, మార్చి24 (నమస్తే తెలంగాణ): గురుకుల సొసైటీల్లో 25వ తేదీ నుంచి ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. గురుకులాల్లో 5వ తరగతి, అదేవిధంగా 6నుంచి 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను మాసబ్‌ట్యాంక్ ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026- 27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని మొత్తం 635 గురుకులాల్లో 5వ తరగతికి సంబంధించి 51,284 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రవేశ పరీక్షకు 1,82,061 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,72,913 మంది (95%) హాజరయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం ఫేజ్-1లో 47,381సీట్ల భర్తీకి ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించినట్టు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు 25వ తేదీ నుంచి ఏప్రిల్15లోగా గురుకులంలో ధ్రువపత్రాలు సమర్పించి అడ్మిషన్ తీసుకోవాలని తెలిపారు.