హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్ల అంతర్గత సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. మిగులు(సర్ప్లస్) టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ సర్దుబాటు చేస్తారు. జీవో-25లోని రేషనలైజేషన్ గైడ్‌లైన్స్‌ను అనుసరించి వర్క్ అడ్జస్ట్ చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు అప్పగించింది. ఇటీవలి కాలంలో కొన్ని స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మరికొన్ని స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో విద్యార్థులున్న చోట టీచర్లు లేకపోగా, టీచర్లున్న చోట విద్యార్థులు లేని పరిస్థితి నెలకొన్నది. 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉండాలి. కానీ రాష్ట్రంలో అంతలోపు విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఒక స్కూళ్లో మిగులు టీచర్లు ఉంటే వారిని విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న స్కూళ్లకు పంపిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల్లో 10లోపు విద్యార్థులకు ఒక టీచర్, 11 నుంచి 60 మందికి ఇద్దరు, 61 నుంచి 90 మందికి ముగ్గురు టీచర్లు ఉంటా రు. ఉన్నత పాఠశాలల్లో 220 లోపు విద్యార్థులకు ఏడుగురు, 221 నుంచి 250 మంది వరకు 8 మంది, 400లోపు విద్యార్థులుంటే 14 మంది టీచర్లు ఉంటా రు. జూన్ 13లోగా వర్క్ అడ్జస్ట్లు పూర్తిచేయాలని విద్యాశాఖ గడువు విధించింది. కలెక్టర్లు జూన్ 30లోపు ప్రక్రియను పూర్తిచేసి నివేదిక పంపించాలి.
ఆదేశాలిలా..