వరంగల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడారంలో సర్కార్ మరో అపచారానికి తెరతీసిందని ఆదివాసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ఇటీవల మేడారంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు, గద్దెల కైవారాన్ని (గద్దెల చుట్టూ ఉన్న ప్రాంగణం) మారుస్తూ రూపొందించిన డిజైన్‌పై ఆదివాసీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఒకదాని తరువాత ఒకటి సోలుపుత (వరుస) పెట్టడం తెలియకనా, స్థలం లేక పెట్టలేదా? అని ఆదివాసీ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తమ సంస్కృతి తెలియకనే సర్కార్ జాతర సంప్రదాయాన్ని మంటగలుపుతున్నదని ఆందోళన చెందుతున్నారు. అసలు తమ జాతరను కుంభమేళాతో పోల్చడంలోనే పెద్ద కుట్ర దాగి ఉన్నదని ఆరోపిస్తున్నారు.
బుధవారం మేడారం జాతర నిర్వహణపై హైదరాబాద్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సందర్శనార్థం అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని పూజారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో రూపొందించిన డిజైన్‌ను మార్చాలని సూచించిన మేరకు కొత్తది రూపొందించారు. భక్తుల సందర్శనార్థం సమ్మక, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎలాంటి జాప్యం లేకుండా అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని మంత్రులు చెప్పారు. ఈ మేరకు రూపొందించిన నూతన డిజైన్‌ను ప్రదర్శించారు. ఆ ప్రదర్శించిన నూతన నమూనాలు వైరల్ అయ్యాయి. దీంతో ఆదివాసీల్లో ఆందోళన, ఆగ్రహం మొదలైంది.
పేరుకు సమ్మక, సారలమ్మ పూజారులతో చర్చించామని చెబుతున్నా, వాస్తవానికి వారికి ఏమీ చెప్పకుండా సంతకాలు తీసుకొని ఉంటారని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం మంత్రుల ఛాంబర్లో ప్రదర్శించిన నమూనా ఫైనల్ కాకపోవచ్చని ఒక వర్గం అభిప్రాయపడుతున్నది. కాగా, ‘మేడారంలో అపచారం, తల్లుల గద్దెలకు కొత్త హంగులు’ పేరుతో గత జూలై 6న ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన ప్రత్యేక కథనం సంచలనం రేపింది. సర్కార్ ముందు తయారుచేసిన డిజైన్‌ను మార్చుకొని మరో నమూనాను రూపొందించింది. అయితే, కొత్తగా రూపొందించిన గద్దెల కైవారం తమ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ గద్దెలు వరుసగా ఉండటమే తీవ్ర అభ్యంతరకరమని, వాటిని మార్చాలని ఆదివాసీ ప్రతినిధులు కోరుతున్నారు. మొత్తానికి మేడారం మహాజాతర సమయానికి సర్కార్ వేసే కొత్త అడుగులు ఆదివాసీల్లో ఆందోళన రేకిస్తుండటం
గమనార్హం.