ఖైరతాబాద్, మే 3: ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను వెంటనే ఆపేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడందెబ్బ) వ్యవస్థాపకుడు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత పేరుతో అమాయక ఆదివాసీ గిరిజనులను బలిచేస్తున్నదని ఆరోపించారు.
అటవీ ప్రాంతంలో విలువైన ఖనిజాలు, నిక్షేపాలను దోచుకోవడానికే కేంద్రం ఈ చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. శాంతిచర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లంబాడీ, సుగారీ, గోరుబంజారా, గోరుమాటీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. ఆదివాసీలకు స్వేచ్ఛా, స్వతంత్రాలతో జీవించే వీలు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్నాక విజయ్, సిద్ధబోయిన లక్ష్మినారాయణ, పాపారావు, అర్జున్‌కుమార్, వెంకన్న, ప్రవీణ్‌కుమార్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.