Operation Kagar | ఖైరతాబాద్, మే 3 : ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హింసను ఆపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) వ్యవస్థాపకులు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ఏరివేత పేరుతో అమాయక ఆదివాసీ గిరిజనులను బలి చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలో విలువైన ఖనిజాలు, నిక్షేపాలను దోచుకోవడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందని ఆరోపించారు.
శాంతిచర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. మైదాన ప్రాంత కులాలైన లంబాడీ, సుగారీ, గోరు బంజారా, గోరుమాటీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీల నివాస ప్రాంతాల్లో రాజ్యాంగ హక్కులను అమలు చేసి వారు స్వేచ్ఛా, స్వతంత్రాలతో జీవించే వీలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడెందెబ్బ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్నాక విజయ్, సిద్ధబోయిన లక్ష్మినారాయణ, పాపారావు, అర్జున్ కుమార్, వెంకన్న, ప్రవీణ్ కుమార్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.