నాంపల్లి కోర్టులు, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక్కరే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ అధికారి ప్రణీత్‌కుమార్ అలియాస్ దుగ్యాల ప్రణిత్రావు, మేకల తిరుపతన్న, రాధాకిషన్‌రావును జైలు అధికారులు కోర్టుకు హాజరుపర్చలేదు. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున రిమాండ్ ఖైదీలను తప్పకుండా కోర్టు ఎదుట హాజరుపర్చాలని పేర్కొన్నది.
హైకోర్టును ఆశ్రయించిన తిరుపతన్న
ఈ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది.
లాకర్ల పేరుతో డబ్బులు వసూళ్లు ;తిరుమలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అరెస్ట్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తిరుమలలో కొత్త రకం మోసం వెలుగుచూసింది. లాకర్ల పేరుతో భక్తుల నుంచి డబ్బులు గుంజుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సాఫ్ట్వేర్ ఉద్యోగి తిలక్‌గా గుర్తించారు. తిరుమలకు వచ్చే భక్తులు తమ వస్తువులను భద్రపర్చుకోవడానికి లాకర్లను తీసుకుంటుంటారు. అయితే తనకు తాను టీటీడీ ఉద్యోగిగా చెప్పుకునే తిలక్ భక్తులకు ఫోన్ చేసి గడువులోగా లాకర్లు ఖాళీ చేయలేదని, ఫైన్ కట్టాలని బెదిరించడం మొదలుపెట్టాడు. ఇలాగే ఓ మహిళా భక్తురాలికి ఫోన్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు తిలక్‌ను అదుపులోకి తీసుకున్నారు. భక్తుల వివరాలు తిలక్ చేతిలోకి ఎలా వెళ్లాయన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.