హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : విశ్వగురు ఏలుబడిలో మన దేశం వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్నదని, ఈ తరుణంలో మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అసవరం ఉందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ పిలుపునిచ్చారు. జాతిలో వైవిధ్యాన్ని చెడగొట్టే వైషమ్యాలను ఎదురించే వారంతా ప్రొఫెసర్ జయశంకర్‌సార్ స్ఫూర్తితో పోరాడాలని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌సార్ స్మారకోపన్యాసంలో భాగంగా ‘వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఇప్పటి అభివృద్ధిని చూసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉంటే బాగుండు అనుకునేవారిని చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళంలో పుదమైపిత్తన్ అనే ఒక కవి రాసిన మాటలను గుర్తు చేసుకున్నారు. గుడిముందు వెలుగుతున్న దీపానికి జనాలు దండం పెడుతుంటే, పుదమైపిత్తన్ మాత్రం ఆ దీపాన్ని వెలిగించిన అగ్గిపుల్లకు నమస్కారం చేశారని, ఎందుకంటే వెలిగే జ్యోతికంటే.. వెలిగించిన జ్యోతి పెద్దది కదా అని అన్నారట. ప్రస్తుతం తెలంగాణలో వెలుగుతున్న జ్యోతి, వెలిగించిన అగ్గిపుల్ల జయశంకర్సారే కదా అని అన్నారు.
మన దేశంలో వైషమ్యాలపై పోరాడుతున్న తనపై వ్యతిరేకులు ఇష్టమొచ్చినట్టు బురద జల్లుతున్నారని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. వారు ఎన్నిసార్లు బుదర జల్లినా ప్రొఫెసర్ జయశంకర్‌సార్ స్ఫూర్తితో ఎన్ని వందలసార్లు అయినా కూడా తుడుచుకొని వెళ్తానని స్పష్టం చేశారు. మన దేశంలో ఉన్న వైవిధ్యతను ఎక్కువగా చూసింది తానేనని చెప్పారు.
దేశంలోని కొందరు దొంగలు తమ ఎజెండాను అమలు చేయడానికి జెనోఫోబియాను వాడుకుంటున్నారని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. దాని ద్వారా విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తున్నారని పేర్కొన్నారు. మన విశ్వగురువు కూడా అదే జెనోఫోబియాను వాడుకుంటున్నారని చెప్పారు. హిట్లర్ కూడా అలాగే చేశారని చెప్పారు. ప్రస్తుతం అమెరికా-రష్యా మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నదని చెప్పారు. అది కూడా బోర్ కొడితే ‘కమ్యూనల్ వార్’ వస్తుందని, దానితో హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైనులు తన్నుకొని చస్తారని పేర్కొన్నారు. అది కూడా బోర్ కొడితే.. టారిఫ్ వార్ వస్తుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ కోసం జయశంకర్ రాజీలేని పోరాటం చేశారని ప్రొఫెసర్ హరగోపాల్ మననం చేసుకున్నారు. తన జీవితాంతం ఆర్థిక ఇబ్బందులను సైతం లెకచేసే వారు కాదని, ఒకోసారి బస్సులో కూడా ప్రయాణం చేసేవారని, వ్యక్తిగత విలువలను జీవితాంతం పాటించిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. విలువలే తన వ్యక్తిగత సంపదగా బతికారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలు కీలకంగా పనిచేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ కృషి అనన్యసామాన్యమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు యూనివర్సిటీల్లో మీటింగుల కోసం గద్దర్‌ను ముఖ్య అతిథిగా పిలిస్తే ఎంతోమంది అధ్యాపకులు వ్యతిరేకించారని, గద్దర్‌ను సమావేశాలకు పిలువాలా? వద్దా? అనే అంశంపై జయశంకర్‌తో చర్చించినట్టు గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు పిలుచుకుంటున్నప్పుడు అడ్డుచెప్పడం బాగోదనే సూచన ఇరువురం చేయడంతోనే మూడుసార్లు గద్దర్ సమావేశాలకు హాజరయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అయనది రాజీలేని పోరాటమని కొనియాడారు. జయశంకర్‌తో కలిసి తాను 15సార్లకు పైగా శాంతి చర్చల కోసం పనిచేశామని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ తల్లి తనకోసం నియమించుకున్న వకీలే జయశంకర్‌సార్ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నాటి పాలకులు తెలంగాణ పోరాటాన్ని వ్యతిరేకిస్తూ.. జయశంకర్‌సార్‌ను ఇబ్బందులు పెడుతుంటే, సస్పెండ్ చేస్తామని బెదిరించినా బెదరని గొప్ప ధైర్యవంతుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న చిదరంబరం చేసిన ప్రకటన ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసిందేనని తెలిపారు. ఆ స్పీచ్ రాయడం వెనుక ఉద్యమనేత కేసీఆర్, జయశంకర్సార్ల మేథోమధనం ఉందని పేర్కొన్నారు. ఆ ప్రకటన తర్వాత తెలంగాణ సిద్ధిస్తుందనే నమ్మకం జయశంకర్సార్లో కలిగిందని చెప్పారు. మన యాసను, ఉర్దూను వెక్కిరించిన గుంటూరు చెందిన జంధ్యాల పాపయ్యశాస్త్రి ఇంటికి వెళ్లి మరీ ఆయన రచనల్లో దాగి ఉన్న ఉర్దూ గొప్పతాన్ని వివరించిన భాషా ప్రేమికుడు జయశంకర్ అని కొనియాడారు.
ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు మాట్లాడారు. వారిలో వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్‌సార్‌తో తనకు 20 ఏండ్లకు పైగా అనుభవం ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి, తన హయాంలో విద్యారంగానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని చెప్పారు. ఒక ప్రొఫెసర్‌గా, పరిపాలన దక్షుడిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన పేరు మీద తనకు స్ఫూర్తి పురస్కారం ఇవ్వడం గొప్ప అనుభూతని, ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఎప్పటికైనా సిద్ధిస్తుందనే నమ్మకం జయశంకర్లో ఎప్పుడూ ఉండేదని ప్రముఖ రచయిత, పురస్కార గ్రహిత అంపశయ్య నవీన్ అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం, ఉద్యమాలు చేయడం, రాజకీయంగా ఉద్యమాన్ని నడిపించడం ద్వారానే స్వరాష్ట్రం సాధించుకోవచ్చని చెప్పేవారని పేర్కొన్నారు. తెలంగాణ పేరు మీద ఒక్క అసెంబ్లీ సీటు వచ్చినా ఉద్యమం ప్రజల్లో బతికి ఉంటుందనే విశ్వసాన్ని తనతో వ్యక్తపరిచారని చెప్పారు. మరో పురస్కార గ్రహీత శ్రీధర్‌రావ్ దేశ్‌పాండే మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతాన్ని నిలువెల్లా నింపుకొన్న వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటుపై అంబేద్కర్ భావజాలాన్ని ప్రజావేదికలపై వినిపించేవారని తెలిపారు. తెలంగాణ పోరాటాన్ని నెహ్రూ చూసి ఉంటే ప్రత్యేక తెలంగాణ ఇచ్చేవారని అన్నారు. కార్యక్రమంలో సీతారామారావు, దేవీప్రసాద్, అయాచితం శ్రీధర్, బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, అభిలాష్‌రావు, పల్లె రవికుమార్‌గౌడ్, కురవ విజయ్, తుంగ బాలు, పాల్గొన్నారు.
ప్రజలకు ఆలోచించే సమయం ఇవ్వకుండా నిత్యం ‘నీ ధర్మం, నీ భాష, కులం డేంజర్లో ఉంది. నీకేం అర్థం కావడంలేదు. మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి మేము చూసుకుంటాం’ అని బయలుదేరుతున్నారని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. ఇట్లాంటి ధోరణితోనే 15 ఏండ్లుగా దేశంలో ముస్లింలు, పాకిస్థాన్, బీఫ్ అంటూ ప్రజలకు ఆలోచన లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, దవాఖానలు లేవు, విద్య ఉండదు కానీ.. ఒక ఆపరేషన్ సిందూర్, ఒక అయోధ్య వంటివి మాత్రం ఉంటాయని ఎద్దేశా చేశారు. మన దేశంలో స్వతంత్రం కోసం, తెలంగాణ కోసం, ఏదైనా పోరాటం కోసం ఉపవాసం చేసిన వాళ్లను చూశాను కానీ, ఒక గుడి ఓపెనింగ్ కోసం 11 రోజులు ఉపవాసం చేసిన వారిని చూశారా మీరు? అది కూడా ఒకరకమైన నిరసనేనా? అని ఎద్దేవా చేశారు. ఇట్లాంటి వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు వాట్సాప్ యూనివర్సిటీని విపరీతంగా వాడుతుంటారని, ఆ యూనివర్సిటీలోనే ప్రకాశ్‌రాజ్ అంటే యాంటీ హిందువుగా సృష్టించారని చెప్పారు. తనకు తెలంగాణ పోరాటాలే స్ఫూర్తి అని చెప్పారు. దేశాన్ని పాలిస్తున్న పాలకులకు సెన్సివిటీ చాలా ముఖ్యమని పేర్కొన్నారు.