అందర్నీ కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలె. కానీ, నేను మంచి గుండాలె.. నావోడు మంచిగుండాలె అనుకోవడం అవివేకం. ప్రభుత్వంలో ఉన్నోళ్లు ఏం మాట్లాడుతున్నరో ప్రజలందరూ గమనిస్తున్నరు. ప్రజలంటే ప్రేమ ఉన్నోళ్లు..అధికారంపై బాధ్యత ఉన్నోళ్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడొచ్చునా? ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సక్రమంగా వినియోగించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిపోయి ఇది కూలగొడతం..అది కూలగొడతం.. వీన్ని అరెస్టు చేస్తం.. వాన్ని లోపలేస్తం.. ఇదేనా ముచ్చట.. గిదా పాలించే తెలివి?
– కేసీఆర్
KCR | హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలు అధికారమిచ్చింది పిచ్చి పిచ్చి తిట్ల కోసమా? ఛండాలమైన మాటల కోసమా? అసలు ప్రభుత్వం చేయాల్సిన పనేంది.. తిట్లు నేర్పుడా? ప్రజలకు తిండిపెట్టుడా?’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలు గొప్ప బాధ్యత ఇచ్చినపుడు ప్రభుత్వంలో ఉన్నోళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘ప్రజలు అధికారమిచ్చింది నిర్మాణం చెయ్యాలని! కూలగొట్టడానికి కాదు.. ఈ సోయి ప్రభుత్వంలో ఉన్నోళ్లకు ఉండాలె’ అని హితవు పలికారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి శనివారం ఎర్రవెల్లికి పెద్దఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇటీవలి కాలంలో కొంతమంది మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా తప్పుబట్టారు.
ప్రభుత్వంలో ఉన్నవాళ్లు సమాజంలో ఉన్న రుగ్మతలను శాశ్వతంగా పోగొట్టేందుకు ముందుకుసాగాలని కేసీఆర్ సూచించారు. ‘అందర్నీ కాపాడాల్సిన బాధ్యత..అందరికీ లాభం చేకూర్చే బాధ్యత తీసుకోవాలె. కానీ, నేను మంచిగుండాలె.. నావోడు మంచిగుండాలె అనుకోవటం అవివేకం. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నరు. ఏం కోల్పోయామో వాళ్లకు అర్థమవుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను అమలు చేయటం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చెప్పిన వాటినే కాదు.. ఇవ్వని హామీలను కూడా అమలు చేసినం’ అని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిందని, ఆడపిల్లలకు స్కూటీలు, రైతుభరోసా కింద రూ.15 వేలు, దళితబంధు, గిరిజన బంధుకు రూ.12 లక్షలు, రుణమాఫీ ఇలా ఒక్కటేమిటి అవకాశం ఉంటే సూర్యచంద్రులను తెచ్చి ఇస్తామని చెప్పి కొసాఖరుకు చుక్కలు చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయటం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. మ్యానిఫెస్టోలో చెప్పిన వాటినే కాదు.. ఇవ్వని హామీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. కల్యాణలక్ష్మి నుంచి మొదలుపెడితే గురుకులాల దాకా అనేకం ఉన్నయ్.
-కేసీఆర్
‘పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు.. హైరానా పడొద్దు.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే’ అని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్నేళ్లకు పూలదండలు..బొకేలకే పోతుంది.. చివరి ఆర్నేళ్లకు ఎన్నికల హడావుడే మొదలవుతుంది.. మధ్యలో ఉన్న నాలుగేండ్లు ప్రజలకు ఏం కావాలో చేయాల్సి ఉంటుంది’ అని వివరించారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తవుతున్నా ఏం చేయాలో తెలుస్తలేదు. ఏం సగబెట్టాలో తెలుస్తలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న వారందరికీ న్యాయం చేయాలని, కానీ, ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయటం పక్కనపెట్టిందని విమర్శించారు. పిచ్చి పిచ్చి మాటలు.. ఛండాలమైన పనులు తప్ప ఒక్క మంచిపని కూడా కనిపించటం లేదన్నారు.
‘ఇది కూలగొడ్తం..అది కూలగొడ్తం. వాన్ని లోపలేస్తం. వీన్ని లోపలేస్తం.. ప్రభుత్వం అంటే గిదే ముచ్చటా? తిట్లు మనకు రావా..ఇయ్యాల మొదలు పెడితే రేప్పొద్దున దాకా తిట్టొచ్చు. తిట్టుడు మన విధానం కాదు’ అని చెప్పారు. పార్టీ శ్రేణులు ఓపికతో ఉండాలని, ప్రజల కోసమే పనిచేయాలని పిలుపు నిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారని, ప్రజల కోసం పనిచేసే నాయకులు పార్టీలో ఉన్నారని, కార్యకర్తలు అధైర్యపడొద్దు.. ఆగం కావద్దని సూచించారు.
బీఆర్ఎస్ శ్రేణులు ఓపికతో ఉండాలె. ప్రజల కోసమే పనిచేయాలె. పిచ్చిపిచ్చి మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రజల మధ్యలో ఉండి.. ప్రజల కష్టసుఖాల్లో భాగం కావాలె. ఒక వ్యక్తి ప్రయోజనం కోసమో.. ఓట్ల కోసమే మనం పనులు చేయలేదు. ప్రజలు తప్పకుండా మన వెంటే ఉన్నరు. కార్యకర్తలు హైరానా పడొద్దు.. మళ్లీ అధికారం మనదే..
-కేసీఆర్
పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పారుపాటి శ్రీనివాస్‌రెడ్డి సహా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీనాయక్, బిల్లా సుధీర్‌రెడ్డి, అనిమిరెడ్డి, మునావత్ నర్సింహనాయక్, పసునూరి నవీన్ కు మార్, శ్రీనివాస్‌రావు, రంగుకుమార్ పాల్గొన్నారు.
పాలకుర్తి మండలం కొండాపురం శివారు మేకల తండాకు చెందిన గిరిజన యువకుడు లకావత్ శ్రీను నాయక్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని పోలీస్ స్టేషన్లో మరణించారు. అతడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి కేసీఆర్ రూ. 3లక్షల ఆర్థిక సాయం అందజేశారు. గిరిజన బిడ్డకు న్యాయం జరిగే వరకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను పాలకుర్తి వచ్చినప్పుడు వారి ఇంటికి వస్తానని చెప్పారు.