హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం సీఎం రేవంత్రెడ్డి తెలివి తకువ తనమని, ఇకనైనా పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని సామజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కంచ గచ్చిబౌలి భూములను అమ్మాలని చూడడం తప్పని, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని సూచించారు. పచ్చని జీవవైవిధ్య ప్రాంతాన్ని నాశనం చేయడమేగాకుండా, అడ్డుకోబోయిన విద్యార్థులను కొట్టడం, కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా హైదరాబాద్ కూడా ఢిల్లీలా వాయుకాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే ఎన్జీటీని ఆశ్రహించాల్సి వస్తుందని హెచ్చరించారు.