BRS | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ) : చెల్లని రూపాయి.. చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి.. ఒకటేనని బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగువైబ్ ట్విటర్ (ఎక్స్) హ్యాండిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలిలోని సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు దాసోజుశ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, అభిలాశ్, కురువ విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.
అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. తెలుగు వైబ్ ద్వారా కాంగ్రెస్ బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావు మధ్య విభేదాలు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తెలుగువైబ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దీని వెనుక ఉన్నవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన హరీశ్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుతంత్రాలకు దిగిందని మండిపడ్డారు. నిరుడు కాంగ్రెస్ సోషల్‌మీడియాపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఇప్పటికైనా చట్టప్రకారం వ్యహరించాలని కోరారు.