ఖమ్మం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేగాక ఓట్లు వేయకపోతే బొక్కలో వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, బానోత్ చంద్రావతితో కలిసి మీడియాతో మాట్లాడారు. బుధవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నదని ఆరోపించారు.
ఏదులాపురం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్థానిక ఉద్యోగ సంఘాల నేతలతో క్విడ్ ప్రోకో చేసుకున్నారని దుయ్యబట్టారు. దానికి సంబంధించిన టెలికాన్ఫరెన్స్ ఆడియోను బయటపెట్టిన తాతా మధు.. పొంగులేటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ఓటమి కోసం పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి తొలగించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాల నాయకులపై రాష్ట్ర ఎన్నికల సంఘం, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రైతులకు యూరియా బస్తా ఇవ్వడం చేతకాని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎదుటివారిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. మధిర పట్టణాన్ని సింగపూర్ చేస్తానని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగల్భాలు పలుకుతున్నాడని, క్షేత్రస్థాయిలో అడుగు కూడా ముందుకుపడలేదని విమర్శించారు. ప్రజలు ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గట్టిగా బుద్ధిచెప్పాలని కోరారు.