గోదావరి నదీ జలాలను పెద్దఎత్తున తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తున్నది. తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు కట్టి పెద్దఎత్తున నీళ్లు తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, అధికారుల అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నది.
– హరీశ్‌రావు
సమయం, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలు పకనపెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. మన రాష్ట్రానికి హకుగా రావాల్సిన నీటి వాటాలు ముఖ్యం. ఆ నీళ్లు సాధించుకోవడానికి, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కండ్లు తెరిచి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
-హరీశ్‌రావు
ఇవాళ ఏపీ ప్రభుత్వం ఏ అనుమతీ లేకుండా 200 టీఎంసీల నీటిని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకొని పోతున్నది. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నరు? ఏపీ ప్రాజెక్టులను ఆపండని కనీసం ఉత్తరం కూడా రాయలేదు.
– హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యా యం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎం దుకు నోరుమెదపడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. పొరుగు రాష్ర్టాలు చే స్తున్న జల దోపిడీపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందు కు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నీటివాటాను ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణగా చెల్లిస్తున్నరా? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నా, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కాంగ్రెస్ సర్కారు కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించా రు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్య మ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలని, నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యా యం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్‌ను మూడింతలు పెంచిందని, 200 టీఎంసీల నీటిని బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్ కు యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ముం దుకుపోతున్నా రేవంత్ సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదని హరీశ్‌రావు విమర్శించారు. ‘తెలంగాణకు సంబంధించి సీతారామసాగర్, స మ్మకసాగర్, కాళేశ్వరంలో 3వ టీఎంసీ, అంబేదర్ వార్ధా పెండింగులో ఉన్నాయి. ఈ నాలు గు ప్రాజెక్టులకు క్లియరెన్సులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, నీటి కేటాయింపు, అంతర్రాష్ట్ర క్లియరెన్స్ కావాలి.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి కావాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. కానీ, ఇవాళ ఏపీ ప్రభుత్వం వీటిలో ఏ అనుమతీ లేకుండా 200 టీఎంసీల నీటిని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకొని పోతున్నది. ఇంత జరుగుతుంటే సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నరు? ఏపీ ప్రాజెక్టులను ఆపండని కనీసం ఉత్తరం కూడా రా యలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాము కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని, నిధులివ్వండని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రెండు లేఖలు రాశారని చెప్పారు. ఏడీబీ నుంచి 40 వేల కోట్ల నిధులిప్పిస్తామని కేంద్రం మాట ఇచ్చిందని గుర్తుచేశారు. బాబు రాసిన లేఖలను మీడియాకు చూపించారు. ‘ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నదా? సీఎం స్వయంగా వెళ్లి కేంద్ర మం త్రులను, ప్రధానిని కలిసి ఈ ప్రాజెక్టులను ఆపాలని అడిగే సోయి లేదా? సలహాదారులు, అధికారులు ఏం చేస్తున్నట్టు?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద, సుప్రీంకోర్టులో తప్పుడు వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్‌దాస్‌కు మూడు నెలల జైలు శిక్ష వేసిందని, ఒక సీఎస్‌కు మూడు నెలల జైలు శిక్ష పడ్డదంటే, ఒక ఆదిత్యనాథ్దాస్కేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసిన ఇలాంటి అధికారిని తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖకు సలహాదారుగా పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టి, తెలంగాణ హకులను కాలరాసే అధికారి ఎవరి కోసం పనిచేస్తరు? మీకు సలహాదారుగా పెట్టుకోవడానికి ఇంకెవ రూ దొరకలేదా? మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? సీఎం ఏమైనా గురుదక్షిణ కింద చెల్లించుకుంటున్నరా? మన రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? ఇది అత్యంత బాధాకరం’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
తుంగభద్ర నీళ్లను తరలించేందుకు అటు కర్ణాటక, ఇటు ఏపీ కాల్వలు తవ్వుకుంటున్నాయని, తద్వారా రాష్ట్రంలోని కల్వకుర్తి, డిండి ఎత్తిపోతలు, సాగర్ ఆయకట్టు నీళ్లందక దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది? 2017లో ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది. గోదావరి, కృష్ణా బేసిన్లో ఏపీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ, ఎప్పటికప్పుడు లేఖలు రాశాం. ఆపగలిగాం. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విషయానికి వస్తే.. బీఆర్ఎస్, కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్-3 సాధించారు. దీని కింద కృష్ణా, గోదావరి జలాలను పున:పంపిణీ చేయాలని అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతికి అప్పటి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.
సుప్రీంకోర్టులో చివరిదాకా పోరాడి విజయం సాధించాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకపోవడంతో ఏపీ ప్రభుత్వం సెక్షన్-3 మీద సుప్రీంకోర్టులో కేసు వేసింది. పదేండ్లు మేం కష్టపడి సెక్షన్- 3 సాధిస్తే మీరు దాన్ని కాపాడాలి కదా? వాదనలు వినిపించాలి కదా? రెండు రాష్ట్రాల మధ్య నదీ పరీవాహక ప్రాంతాల ప్రకారం నీళ్లు సాధించుకోవాలి కదా? దీనిపై దృష్టిపెట్టి కేంద్రానికి, అన్ని ఫోరమ్స్‌కు లేఖలు రాయాలని, అవసరమైతే సుప్రీంకోర్టులో పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే ప్రెస్‌మీట్ పెట్టినం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
‘మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం సూచనలిస్తున్నాం. మీరేమో పట్టించుకోవడం లేదు. మీరు ఢిల్లీ యాత్రల్లో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి. మీకు నిజాయితీ ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మేం వచ్చి మీకు విలువైన సూచనలు, సలహాలిస్తాం. అర్థం కాకపోతే అ డగండి, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి, తిట్లు బూ తులు వద్దు, మేం తిట్టలేక కాదు, బూతులు మాట్లాడలేక కాదు’ అని హరీశ్‌రావు చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు గట్టు రామచందర్‌రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, విప్లవ్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కురవ విజయ్ పాల్గొన్నారు.
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫెయిల్ అయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుకు నిధులు కావాలని కేంద్రమంత్రికి నవంబర్‌లో ఉత్తరం రాస్తే.. దానిపై ఇప్పటివరకు మంత్రి ఉత్తమ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అక్రమ ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపకుండా ఏమి చేస్తున్నారు? ఉత్తరం రాయలేనంత బిజీగా ఉన్నరా? అని ప్రశ్నించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, రేవంత్ సర్కారు ఏమి చేస్తున్నట్టు.. దొంగలు పడ్డ ఆరునెలలు కుక్కలు మొరిగినట్టు.. ఇంకెప్పుడు రాస్తరు? అని నిలదీశారు. ఒకవేళ రాస్తే ఆ ఉత్తరం చూపించాలని డిమాండ్ చేశారు.