హనుమకొండ, అక్టోబర్ 23 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) భూముల అమ్మకం వ్యవహారం రాజధాని దాటి జిల్లాలకు చేరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను (Warangal) రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని పదేపదే మంత్రుల ప్రకటనలు.. ఇప్పుడు అభివృద్ధిలో కాకుండా భూముల అమ్మకంలో నిజమవుతున్నది. వరంగల్ మహానగరంలోని అతి ఖరీదైన స్థలాన్ని అడ్డగోలుగా దక్కించుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేతలు రంగం సిద్ధం చేశారు. బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు అధికారికంగా కైవసం చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ బస్టాండ్ సమీపంలోని 2 ఎకరాల 27 గుంటల భూమిని బహిరంగ వేలంలో అమ్మేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) నోటిఫికేషన్ ఇచ్చింది.
నవంబర్ 3న బహిరంగ వేలం ఉంటుందని ప్రకటించింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వేలం ప్రక్రియలో భూములను విక్రయించడం కొత్తమే కాదు. ఇప్పుడు మాత్రం గతంలో ఎప్పుడూ లేనట్టుగా చేస్తున్నది. ‘కుడా’ ఇప్పటివరకు వరంగల్ నగర పరిధిలో, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, ప్రైవేటు వ్యక్తుల భూములను సేకరించి ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేసి బహిరంగ వేలంలో విక్రయించింది. ఇప్పుడు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధీనంలోని భూమిని కమర్షియల్ ప్లాట్లు లేదా ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేయకుండానే బహిరంగ వేలం ప్రక్రియకు సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కోసమే ఇప్పుడు భూముల అమ్మకానికి ‘కుడా’ కొత్త రకంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ నగరంలోని హనుమకొండ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి.
ప్రస్తుత హనుమకొండ బస్టాండ్, ఎల్బీ స్టేడియం, స్పోర్ట్స్ హాస్టల్ నుంచి సబ్‌స్టేషన్ వరకు దాదాపు 100 ఎకరాలు ఉండేది. అక్కడ ఓ కుంట ఉండేది. 1085, 1086 సర్వే నంబర్లలోని భూములను సేకరించేందుకు 1855లో నిజాం ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. నిజాం తర్వాత వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఈ స్థలం ఉన్నది. ఆ తర్వాత కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి మారింది. డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించిన భూమి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ వాహనాల యార్డు, ఇటీవల గుడిసెలు ఖాళీ అయిన స్థలం… తాజాగా, వేలానికి ఏర్పాట్లు చేస్తున్న భూమి కలిపి 12 ఎకరాలు ఉన్నది. సబ్‌స్టేషన్, డంపింగ్ యార్డు వాహనాల షెడ్డు మధ్యలోని 2.27 ఎకరాల స్థలాన్ని కుడా వేలం వేస్తున్నది.
మెయిన్ రోడ్డుకు అనుబంధంగా ఉండే 50 ఫీట్ల రోడ్డులోని ఈ స్థలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రం నిర్మించాలని 2014 లో నిర్ణయించింది. ఆ తర్వాత కాళోజీ కళా క్షేత్రాన్ని మెయిన్ రోడ్డుకు ఆనుకొని నిర్మించింది. అప్పటినుంచి ఈ స్థలం ఖాళీగానే ఉన్నది. ఈ స్థలం చుట్టూ కుడా ప్రహరీ కట్టించింది. వేలం నిర్వహించే భూమి కమర్షియల్ క్యాటగిరీలో ఉన్నదా? నివాస స్థలమా? అనేది కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ స్పష్టత ఇవ్వడంలేదు. ఏ క్యాటగిరీ అయినా ప్లాట్లుగా చేసి వేలం నిర్వహిస్తే పోటీ ఎక్కువగా ఉండి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి డబ్బులు ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు అస్పష్టతతో పోటీ తక్కువగా ఉంటుందని, కాంగ్రెస్‌లోని కొందరు ప్రజాప్రతినిధుల కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.