కుమ్రం భీం ఆసిఫాబాద్ : లైంగికదాడి కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు(Jail) శిక్ష, రూ. 20,000 జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా(Asifabad) సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చారు. సీఐ జి.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. అసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఓ వివాహితతో వరుసకు మామ అయిన నిందితుడు చునార్కర్ ముకుందరావు అనే వ్యక్తి సదరు మహిళను తన కోరిక తీర్చమని వెంటపడుతుండేవాడు.
అందుకు తను ఒప్పుకోకపోయేసరికి వేరే వాళ్లతో అక్రమ సంబంధం ఉందని నానా బూతులు తిడుతూ తప్పుడు ప్రచారం చేసేవాడన్నారు. తేదీ 5.01.2021 నాడు రాత్రి ఏడు గంటలకు తన భర్త లేని సమయం చూసి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి లైంగిక దాడికి యత్నించాడని(,Women assault) పేర్కొన్నారు. అదే సమయానికి సదరు మహిళ భర్త వచ్చేసరికి పారిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారన్నారు.
సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో నిందితుడు ముకుందరావుకి ఐపీసీ సెక్షన్448,376/511 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష, 20,000 రూపాయల చొప్పున జరిమాన విధించారని వివరాలను వెల్లడించారు. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత టౌన్ సీఐ సతీష్, ఎస్ఐ రాజేశ్వర్, కోర్టు అసిఫాబాద్ డివిజన్ లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్ను జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు అభినందించారు.