హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులు సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రెండు గ్లాసుల విధానం తరహాలో రెండుకార్డుల విధానం ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో-252 ఉత్తర్వులను సవరించింది. అక్రెడిటేషన్ కార్డులు, మీడియా కార్డులు అనే విభజనను వెనక్కి తీసుకున్నది. అందరికీ అక్రెడిటేషన్ కార్డులే ఇస్తామని స్పష్టంచేసింది. అంతేకాకుండా, రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీలో డెస్క్ జర్నలిస్టులకు చోటు కల్పించింది. ఈ మేరకు గతంలో జారీచేసిన జీవో-252కు సవరణలు చేస్తూ తాజాగా జీవో-103ని జారీచేసింది. అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం 2025 డిసెంబర్ 22న ప్రభుత్వం జీవో-252ను జారీచేసిన విషయ ం తెలిసిందే. అయితే, గతంలో జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులివ్వగా, కొత్తగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇస్తామని ఆ జీవోలో పేర్కొన్నది. అందులో మహిళా కోటా గురించి కూడా ప్రస్తావించలేదు. ఇలాంటివి అనేక మార్పులు చేసింది. జీవో-252ను జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డెస్క్ జర్నలిస్టుల పట్ల వివక్ష చూపడాన్ని తీవ్రంగా నిరసించాయి. మీడియా కార్డులను రద్దుచేయాలన్న ఏకైక డిమాండ్‌తో ప్రత్యేకంగా డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆవిర్భవించింది.
చలో కలెక్టరేట్..
అక్రెడిటేషన్ కార్డులకు కోతపెట్టడాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే-హెచ్ 143, వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ), టీయూడబ్ల్యూజేఎఫ్, డెస్క్ జర్నలిస్టులు, ఇతర సంఘాలు ఉద్యమించాయి. చలో కలెక్టరేట్లకు పిలుపునిచ్చాయి. పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాడాయి. కలెక్టరేట్ల ఎదుట పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించాయి. కలెక్టర్లను కలిసి జీవోను మార్చాలంటూ వినతిపత్రాలు సమర్పించాయి. కొందరు జర్నలిస్టులు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఇదే విషయంపై కలిసి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన జర్నలిస్టు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025లో కొన్ని మార్పులు చేస్తూ తాజాగా జీవో-103 విడుదల చేసింది.
ఇవీ మార్పులు..
జీవో సవరణపై డీజేఎఫ్టీ హర్షం
జర్నలిస్టుల అక్రెడిటేషన్లకు సంబంధించి ప్రభుత్వం సవరణ జీవో 103ను విడుదల చేయడంపై డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ(డీజేఎఫ్టీ) హర్షం వ్యక్తం చేసింది. డెస్క్ జర్నలిస్టుల వినతిపై సానుకూలంగా స్పందించి మీడియా కార్డులకు బదులు అక్రెడిటేషన్లు ఇచ్చేందుకు అంగీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి డీజేఎఫ్టీ అధ్యక్ష, కార్యదర్శులు బాదిని ఉపేందర్, మస్తాన్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని సంస్థల్లో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రిని ఈ ప్రకటనలో కోరారు.
ఇంకా మార్చాల్సిందే: అల్లం నారాయణ
అక్రెడిటేషన్ రూల్స్‌లో మరికొన్ని మార్పులు చేయాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. ఈసారి కేబుల్ చానల్స్‌కు పూర్తి అన్యాయం చేశారు. ఈ చానల్స్‌కు 12 కార్డులు ఇవ్వాల్సి ఉండగా, ఈ కోటాను పూర్తిగా రద్దుచేశారు. నియోజకవర్గ రిపోర్టర్ కార్డులను పునరుద్ధరించలేదు. రిపోర్టర్, డెస్క్, ఫొటోగ్రాఫర్ కార్డుల సంఖ్యను పెంచాల్సి ఉండగా, పెంచలేదు. సవరించిన జీవోపైనా జర్నలిస్టు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. దీనిని కంటితుడుపు చర్యగా అభివర్ణిస్తున్నాయి. జీవోలో మరికొన్ని మార్పులు చేయాలని టీయూడబ్ల్యూజేయూ-హెచ్ 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మంగళవారం సమాచార శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.