హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూ రో ప్రకారం.. సైబర్ నేరాలు ఎక్కువ నమోదైంది తెలంగాణలోనే. కారణం.. బాధితుల ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయటం. సైబర్ నేరాలపై ఫిర్యాదు అనగానే నేరస్థులను పట్టుకోవటం తమ వల్ల కాదని ఇతర రాష్ర్టాల పోలీసులు చేతులెత్తేస్తుంటే.. ప్రతి కేసును సవాల్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు మన సైబర్ పోలీసులు. పలు సంచలనాత్మక కేసులను ఛేదిస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. ఏ రాష్ట్ర పోలీసులకు సాధ్యం కాని కేసులనూ పరిష్కరిస్తూ దేశంలోనే తొలిస్థానంలో ఉన్నారు. లోన్ యాప్ కేసుల దర్యాప్తు, ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో పోలీసుల రికవరీలే ఇం దుకు ప్రత్యక్ష నిదర్శనాలు.
నిరుడు దాకా సైబర్ పోలీస్ స్టేషన్లలోనే ఫిర్యాదు చేసే సదుపాయం ఉండేది. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్‌ను నియమించింది. అక్కడ రూ.వెయ్యి నుంచి రూ.లక్ష వరకు జరిగే మోసాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గతంలో బాధితులు కూడా పోయింది పదివేలే కదా! సైబర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలా! అని వెళ్లకపోయేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. రూ.వెయ్యి పోయినా ఠాణాల్లో ఫి ర్యాదు చేస్తున్నారు. అన్ని కేసులను నమోదు చేస్తుండటంతో వాటి సంఖ్య కూడా పెరిగింది.
సైబర్ నేరగాళ్లలో అంతర్రాష్ట్ర ముఠాలే 99.9 శాతం. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లోనే ఎక్కువగా సైబర్ నేరగాళ్లు తిష్ట వేశారు. అ యినా.. మన దగ్గర ఫిర్యాదు చేస్తే, పోలీసులు రాష్ర్టాలు దాటి వెళ్లి, నిందితులను అరెస్టు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇతర రాష్ర్టాల పోలీసులు సహకరించకున్నా, ప్రాణాలకు తెగించి ఎన్నో కేసులను పరిష్కరిస్తున్నారు.
చైనీయుల అండతో పుట్టుకొచ్చిన రుణయాప్‌లతో ఎంతో మంది అమాయకులను సైబర్ నేరగాళ్లు దోచుకొన్నారు. అలాంటి వారికి తెలంగాణ సైబర్ పోలీసులు కళ్లెం వేశారు. హైదరాబాద్ పోలీసులు చేసిన దర్యాప్తు ఆధారంగానే లోన్‌యాప్‌ల కేసులను ఈడీ దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. పెట్టుబడుల పేరుతో అమాయకులను దోచేస్తున్న సైబర్ నేరగాళ్లను ఇతర రాష్ర్టాల్లోకి వెళ్లి నిఘా వేసి సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోనే తొలిసారిగా సుమారు రూ.10 కోట్ల వరకు రికవరీ చేసి శభాష్ అనిపించుకొన్నారు.