Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాకపోవడానికి రైతులనే బాధ్యులను చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా? ఇందుకోసమే కుటుంబ నిర్ధారణ సర్వే చేపడుతున్నదా? రైతు తెలిపిన వివరాల ప్రకారం ఆ రైతుకు రుణమాఫీ కాకపోతే వారినే బాధ్యులుగా చేయనున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కుటుంబ నిర్ధారణ కోసం చేపట్టిన సర్వేపై రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. రేషన్‌కార్డు లేని రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ చేపట్టింది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా సర్వేను ప్రారంభించింది. క్షేత్రస్థాయి అధికారులు ఎంపిక చేసిన రైతుల వద్దకు వెళ్లి ఆ రైతు కుటుంబసభ్యుల వివరాలను సేకరించనున్నారు. కుటుంబ సభ్యుని పేరు, ఆధార్ నంబర్, వయసు, కుటుంబ పెద్దతో సంబంధం వివరాలను సేకరించనున్నారు. ఈ ఫారంపై రైతుతో సంతకం కూడా చేయించుకుంటున్నారు.
దీని మీద సంతకం పెడితే తాను ఇచ్చిన వివరాలన్నీ సరైనవేనని, తప్పుడు వివరాలతో రుణమాఫీ పొందితే అందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని రైతు ఒప్పుకొన్నట్టే. రుణమాఫీ సొమ్మును రికవరీ చేసేందుకు కూడా అంగీకరించినట్టే. కుటుంబ సభ్యులందరి ఆధార్ వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. ఆయా ఆధార్ నంబర్లకు రుణమాఫీ నిబంధనలను అమలుచేస్తుంది. కుటుంబంలో ఏ ఒక్కరైనా ఆదాయపన్ను చెల్లిస్తే.. ఆ కుటుంబం మొత్తానికి రుణమాఫీ అమలు కాదు. దీనిపై రైతులు ప్రశ్నించడానికి కూడా వీలులేదు. ఎందుకంటే ఆ రైతే అన్ని వివరాలను ఫారంలో రాసి సంతకం పెట్టారు కాబట్టి. ఈ విధంగా సర్వే ద్వారా రుణమాఫీ కాకపోతే రైతులు గోల చేయకుండా, ప్రభుత్వాన్ని నిందించకుండా వారి చేతులు వారిపైనే పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. రుణమాఫీ కాని రైతులు ప్రశ్నించకుండా వాళ్లనే బాధ్యుల్ని చేసే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నదని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
సీఎం చెప్పిన లెక్కకు చేస్తున్న లెక్కల్లో తేడా
రుణమాఫీకి సంబంధించి రేషన్‌కార్డు లేని రైతుల లెక్కలోనూ ప్రభుత్వం కోతలు పెడుతున్నది. మొదట సీఎం చెప్పిన లెక్కకు, ఇప్పుడు కుటుంబ నిర్ధారణ చేస్తున్న లెక్కకు పొంతన లేకపోవడంతో రైతు సంఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. మొదటి విడత రుణమాఫీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రేషన్‌కార్డు లేని 6.36 లక్షల మందికి తర్వాత కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న కుటుంబ సర్వేలో 4.24 లక్షల మంది రైతులను మాత్రమే చూపిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. సీఎం చెప్పిన లెక్కకు ప్రస్తుతం సర్వే చేస్తున్న లెక్కతో పోల్చితే 2.12 లక్షల మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా ఎక్కడకు పోయారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ 4.24 లక్షల మందిలో కూడా ఇంకెంత మందికి కోత పెడతారోననే చర్చ జరుగుతున్నది.