హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నీటిపారుదల శాఖలో అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని కోరుతూ సోమవారం లేఖ రా సింది. అవినీతికి సంబంధించిన కేసులలో, విచారణలలో పాలుపంచుకున్న అనుమానిత అధికారుల వివరాలను తాము తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రతి కేసుకు విడివిడిగా లేఖలు రాసి వివరాలు సేకరించడం వల్ల విచారణ ఆలస్యం అవుతున్నదని ఏసీబీ తెలిపింది. దీనిని నివారించడానికి రాష్ట్రంలోని నీటిపారుదల శాఖలోని ఉద్యోగుల వివరాలను నిర్దిష్ట ప్రొఫార్మాలో (హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ) ఒకేసారి అందించాలని కోరింది. సేకరించిన ఈ సమాచారాన్ని ఏసీబీ నియమించబడిన అధికారి కస్టడీలో ఉంచుతారని, ఏసీబీ డైరెక్టర్ జనరల్ (డీజీ) అనుమతి తర్వాత మా త్రమే దీనిని వినియోగించుకుంటారని హా మీ ఇచ్చారు. సంక్షిప్తంగా, అవినీతి కేసులను త్వరగా పూర్తి చేయడానికి, దర్యాప్తు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించడానికి అవసరమైన సిబ్బంది డేటాను ముందుగానే సేకరించడానికి ఏసీబీ ఈ లేఖ రాసినట్టు తెలిసింది.
టెట్ నుంచి మినహాయింపునివ్వాలి: జాక్టో
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సర్వీస్‌లో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్రప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరింది. జాక్టో స్టీరింగ్ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. టీచర్ల సర్వీస్ రూల్స్ రూపొందించి, ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్, బీఈడీ, జేఎల్, టీచర్లకు పదోన్నతి కల్పించాలని జాక్టో నేతలు డిమాండ్‌చేశారు. గిరిజన సంక్షేమశాఖలో షరతుల్లేకుండా భాషాపండితులు, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయాలని, పదోన్నతులు చేపట్టాలని, ఉద్యోగులందరికి హెల్త్‌కార్డులు జారీచేయాలని, టీచర్లు, హెచ్ఎంలను బోధనేతర పనులకు వినియోగించరాదని కోరారు. సమావేశంలో జాక్టోచైర్మన్ జీ సదానందంగౌడ్, సెక్రటరీ జనరల్ కే కృష్ణుడు, కోశాధికారి జీ హేమచంద్రుడు, రాములు పాల్గొన్నారు.