హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్ రూరల్, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లలోని కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అవకతవకలను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.
మూడు డివిజన్లలో భారీగా ట్యాక్స్ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు సర్కిళ్లలోనే రాత్రి వరకూ సోదాలు జరిగాయి. బోయినపల్లి, ఖైరతాబాద్, సోమాజిగూడ, జీడిమెట్ల-2 తదితర సర్కిళ్లలో అధికారులు అర్ధరాత్రి వరకూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అవకతవకలకు సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.