హైదరాబాద్, జనవరి 9 (నమస్తేతెలంగాణ) : ఈ ఒక్క కేసే కాదు వంద కేసులు పెట్టినా పోరాటం ఆపబోమని, ప్రతినిత్యం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘ఫార్ములా ఈ-రేస్‌లో అరపైసా అవినీతి కూడా జరగలేదు.. నేను ఎలాంటి తప్పూ చేయలేదు.. ఎవరికీ తలవంచేది లేదు’ అని స్పష్టంచేశారు. ఏసీబీ కార్యాలయంలో గురువారం విచారణకు వెళ్లేముందు, హాజరైన తర్వాత మీడియాతో, అనంతరం తెలంగాణ భవన్లో పెద్దసంఖ్యలో తరలివచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఏసీబీ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పినం..మళ్లీ ఎన్నిసార్లు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం’ అని చెప్పారు. ‘గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి పైశాచికానందం కోసమే నన్ను జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నరు. ఆయన బెదిరింపులకు కేసీఆర్ సైనికులెవరూ భయపడబోరు’ అని స్పష్టంచేశారు. తాను హైదరాబాద్ ఇమేజ్ను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు, తెలంగాణను ఎలిక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చేందుకే ఫార్ములా ఈ- కారు రేస్‌ను ఇక్కడికి తెచ్చానని వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలపటానికి నాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశామని, ఆ ప్రయత్నాలు చాలా వరకు ఫలించి హైదరాబాద్ దేశంలోనే గొప్పనగరంగా, ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు.
సీఎం డైరెక్షన్లోనే ఏసీబీ ఈ కేసు విచారణ చేపట్టిందని, రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అధికారులు అటు తిప్పి ఇటు తిప్పి అడిగారు తప్ప ఏమీ లేదని కేటీఆర్ తెలిపారు. మంత్రిగానే ఫార్ములా సంస్థకు నగదు చెల్లింపు నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ‘రేవంత్‌రెడ్డి సీఎంగా మూర్ఖపు వ్యవహారాలు చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు మరిచి కేసులు, కక్ష సాధింపుతో పాలన సాగిస్తున్నాడు’ అని ధ్వజమెత్తారు.
ఫార్ములా ఈ రేస్‌లో ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఏసీబీ విచారణ చేపట్టింది. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే అధికారులు అటు తిప్పి ఇటు తిప్పి అడిగారు తప్ప వేరే లేదు. ప్రభుత్వం నుంచి వెళ్లిన డబ్బు ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్నాయనే విషయం వారే చెప్పారు. అలాంటప్పుడు అక్రమాలకు తావెక్కడిది?
‘రేవంత్..నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు రమ్మంటే వస్తా.. ఈ రేసుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమే.. ఇద్దరం లై డిటెక్టర్ పరీక్ష చేసుకుందాం’ అని కేటీఆర్ సవాల్ చేశారు. ‘ఏసీబీ అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పిన. ఇంకా ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తానని కూడా వారికి స్పష్టంగా చెప్పిన. ఏసీబీ కేసులో ఏమీలేదనే విషయం కేసు పెట్టినవారికి కూడా తెలుసు. ఏం చేయాలో? ఏం అడగాలో వారికే తెలియటం లేదు. అధికారులకు ఏం చేయాలో తోచటం లేదు. వారూ ఒత్తిడిలో ఉన్నారు’ అని వివరించారు. ‘దొంగతనం గురించి రేవంత్‌రెడ్డికి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. ఎలాగైనా మమ్మల్ని జైల్లో పెట్టాలన్నదే రేవంత్ దురాలోచన’ అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ జయించి బయటకొచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘నేనేమీ ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.50 లక్షలతో దొరికిన దొంగను కాదు.. మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఆరు గ్యారెంటీలను, వాటిలో అంతర్భాగమైన 420 హామీలను అమలు చేసేదాకా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం’ అని తేల్చిచెప్పారు. తమకు న్యాయ వ్యవస్థ మీద.. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉన్నదని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.
దొంగతనం గురించి రేవంత్‌రెడ్డికి తెలిసినంత మరెవ్వరికీ తెలియదు. నేను దొంగతనం చేసి జైల్లో ఉన్న.. వాళ్లు ఏ తప్పూ చేయకున్నా జైల్లో పెట్టాలె అన్నదే రేవంత్ ఆలోచనగా తేలిపోయింది. రేవంత్‌రెడ్డికి ఉన్నది పైశాచికానందమే.. ఇంతెందుకు రేవంత్‌రెడ్డీ.. నన్ను నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు రమ్మంటావా? వస్తా. ఇద్దరం లై డిటెక్టర్ పరీక్ష చేసుకుందాం. అప్పుడు తేలుతుంది.. దొంగవు నువ్వో..నేనో!
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఆశ్రిత పక్షపాతానికి తావివ్వలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘మా బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్టులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకోలేదు. నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు’ అని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకు ఉన్న చావు తెలివితేటలు తమకు లేవని దెప్పిపొడిచారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం కొంతమందికి అర్థమై, అర్థంకాక మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బంగడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏం చేసినా చెల్లుతుందనుకునే కాంగ్రెస్ నాయకులకు నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పారు.
కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా సిరిసిల్ల నుంచి వచ్చిన వారికి కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణభవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పద్మారావుగౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గాదరి కిశోర్, గొంగిడి సునీత, సుంకె రవిశంకర్, నాయకులు దూదిమెట్ల బాలరాజుయాదవ్, కిషోర్‌గౌడ్, కురువ విజయ్‌కుమార్, గెల్లు శ్రీనివాస్, ఏనుగు రాకేశ్‌రెడ్డి, తుంగ బాలు, మహిళా నాయకులు తుల ఉమ, సుమిత్రా ఆనంద్, సుశీలారెడ్డి, మంత్రి శ్రీదేవి, రజితారెడ్డి, కిర్తీలత, పావనీగౌడ్, మంజులావాణి పాల్గొన్నారు.
పదేండ్లుగా అత్యంత నీతి, నిబద్ధతతో మంత్రిగా పనిచేసిన. ఫార్ములా ఈ రేస్‌లో రూపాయికాదు కదా.. అరపైసా కూడా అవినీతికి పాల్పడలేదు. కానీ ఇందులో ఏదో మతలబు ఉన్నదని ప్రభుత్వం ఒత్తిడి చేసి నాపై ఏసీబీతో చెత్తకేసు పెట్టించింది. ఇందులో విషం తప్ప విషయం లేదు.
ఏసీబీ విచారణకు హాజరై తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ద్వారం వద్ద మహిళా నాయకులు హారతి ఇచ్చి, దిష్టితీసి, కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ‘జై తెలంగాణ..జై కేసీఆర్..జై కేటీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భుజాలపై ఎత్తుకొని భవన్‌లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తరలివచ్చిన నాయకులకు కేటీఆర్ అభివాదం చేశారు. అనంతరం చాలామంది నాయకులు కేటీఆర్‌ను కలిశారు. అండగా ఉంటామని అభయమిచ్చారు. తెలంగాణ భవన్ నుంచి నందినగర్‌లోని ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారతి ఇచ్చి ఆహ్వానించారు.
ఏడాదిగా కాంగ్రెస్‌ను, రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నది బీఆర్ఎస్సేనని కేటీఆర్ చెప్పారు. ‘విద్యుత్ చార్జీలు పెంచొద్దని కొట్లాడింది బీఆర్ఎస్.. లగచర్ల రైతులను జైళ్లలో పెడితే కొట్లాడింది బీఆర్ఎస్.. హైడ్రాపేరుతో పేదల ఇండ్లను కూలగొడితే అడ్డుకున్నది బీఆర్ఎస్.. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే అడుగడుగునా నిలదీస్తున్నది బీఆర్ఎస్.. నన్ను జైలులో పెట్టడం ద్వారా మా పార్టీ కేడర్‌ను, నాయకత్వాన్ని దారిమళ్లింపు, దృష్టిమళ్లింపు చేస్తానని అనుకుంటున్నవ్ రేవంత్‌రెడ్డీ.. అది నీ వల్ల కాదు. ఇంకో వంద పెట్టుకో.. వెయ్యిపెట్టుకో.. మాకు న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తం. నిజాయితీగా ఉన్నం. నీలా తుచ్ఛపు పనులు చేయలేదు.. చేయబోము’ అని స్పష్టంచేశారు.
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ సర్కారు పెట్టింది ఝూటా కేసు అని మాజీ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. బీఆర్ఎస్ 14 ఏండ్ల పోరా ట చరిత్రలో ఎన్నో అక్రమ కేసులను భరించిందని తెలిపారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సర్కార్ అక్రమ కేసులతో బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడబోమని తేల్చిచెప్పారు.
కేటీఆర్‌పై కక్ష సాధింపు చర్యలో భాగంగా తప్పుడు కే సులు బనాయించడా న్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ను ఏడు గంటలు ప్రశ్నించిన ఏసీబీ.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని ఎద్దే వా చేశారు. ఏసీబీ కేసులో ఏమాత్రం పస లేదని వ్యాఖ్యానించారు.
కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిని విస్మరించి అబద్ధాలు, కేసుల పునాదులపై పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన దురాగాతాలు ఎన్నోరోజులు నడవవని పేర్కొన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. కేటీఆర్ గురించి బీర్లకు మాట్లాడే స్థాయి లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలుచేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. అక్రమ అరెస్టులతో హామీల నుంచి తప్పించుకోలేరని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల భరతం పడతామని హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీల అమలు చేతగాకనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేటీఆర్‌ను అరెస్టు చేయాలని రేవంత్ చూస్తున్నాడని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హామీలను అమలుచేయాలని నిలదీస్తున్నందుకే ఈ వేధింపులని మండిపడ్డారు. ఏడాదిపాటు శ్రమించి పసలేని కేసు పెట్టారని దుయ్యబట్టారు. కేటీఆర్ లాయర్‌తోపాటు హాజరవడానికి హైకోర్టు అనుమతి కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతులను నొక్కడం, అక్రమ కేసులు బనాయించడం, బెదిరించడం రేవంత్‌రెడ్డి రాజ్యంలో కామన్ అయిందని, అయినా ప్రభుత్వం తమ పోరాటం ఆపబోమని బీఆర్ఎస్ సీనియర్ నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పాలించడం చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసులు పెడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు.
కేటీఆర్ ఫార్ములా-ఈ తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ను పెంచితే, కాంగ్రెస్ సర్కారు డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నదని బీఆర్ఎస్ యూత్ విభాగం నాయకుడు తుంగ బాలు దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా-ఈ కంపెనీ ప్రతినిధులతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌పై కేసులు పెడుతూ బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ బీర్ల అయిలయ్య పదేండ్లు నిజాయతీ, నిబద్ధతతో మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై అడ్డదిడ్డంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయడం చేతగాని కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీగా నిర్బంధాలను మాత్రం అమలుచేస్తున్నదని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డా రు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అసమాన పోరాటం చే శారని, ఈ చెత్త కేసులో వెనుకడుగు వేయబోరని పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ తెచ్చి రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి పెంచిన కేటీఆర్‌పై ముఖ్యమంత్రి తప్పుడు కేసులు మోపుతున్నారని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల ను అటకెక్కించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ఏ తప్పు చేయని కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రశ్నించే గొంతుల ను అణిచివేయడం లో భాగంగానే కేటీఆర్‌పై రేవంత్ సర్కారు తప్పుడు కేసు పెట్టిందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ మాజీ చైర్మన్ ఉపేంద్ర విమర్శించారు. హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికే ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహించారని, ఇందు లో ఎలాంటి అవినీతి జరగలేదని స్ప ష్టంచేశారు. ప్రాథమిక విచారణ చేయకుండా ఏడాది తర్వాత కేటీఆర్‌ను ఇ బ్బందిపెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసు బనాయించారని విమర్శించారు.
రేవంత్ ప్రభు త్వం.. ఏసీబీని కాస్తా అనుముల కాన్సపారసీ బ్యూరోగా మా ర్చుకున్నదని బీఆర్ఎస్ నేత కురువ విజయ్‌కుమార్ ఆరోపించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని ధీమా వ్యక్తంచేశారు. 50 లక్షలతో ఏసీబీకి అడ్డంగా దొరికి జైలుకెళ్లిన రేవంత్అందరూ ఆయనలాగే అవినీతి చేస్తార ని అనుకుంటున్నారా?అని నిలదీశారు.
తాము తెలంగాణ ఉద్యమకారులమని, తమకు జైళ్లు కొత్తకాదని బీఆర్ఎస్ సీనియర్ నేత గజ్జెల నగేశ్ పేర్కొన్నారు. రేవంత్ పాలన గాలికి వదిలి నిర్బంధా లు కొనసాగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
తాము తెలంగాణ ఉద్యమకారులమని, కేసులకు భయపడబోమని, ఒక్క కేటీఆర్‌ను జైలుకు పంపిస్తే.. లక్షల మంది కేటీఆర్‌లు పుట్టుకొస్తారని బీఆర్ఎస్ అ ధికార ప్రతినిధి రజితారెడ్డి హెచ్చరించా రు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతు న్న గొంతులను అణగదొక్కాలని రేవం త్ సర్కార్ చూస్తున్నదన్నారు.
పరిపాలన చేతగాక, ఆరు గ్యారెంటీలను అమలుచేయలేక తన ఫెయిల్యూర్‌ను డైవర్ట్ చేసేందుకే రేవంత్‌రెడ్డి ఫార్ములా రేసు కేసును తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేటీఆర్, బీఆర్ఎస్ సైనికులం భయపడబోమని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేక డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత ఏనుగు భరత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిత్యం నిలదీస్తున్న కేటీఆర్‌ను బద్నాం చేసేందుకే ఫార్ములా-ఈ కేసును తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోజుకో అబద్ధంతో పాలన సాగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.