ఇల్లెందు, ఫిబ్రవరి 18 : రోడ్డు నిర్మాణ పనులకు గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ రేంజర్, బీట్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. ఇల్లెందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బోయినతండాలో రోడ్డు నిర్మాణ పనులకు గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ అటవీ శాఖ రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నూనావత్ హరిలాల్‌ను సంప్రదించగా.. రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు.
మంగళవారం కొమరారం రేంజర్ కార్యాలయంలో సదరు కాంట్రాక్టర్.. రేంజర్, బీట్ ఆఫీసర్‌కు రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు.