అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని ముఖ్యమంత్రి.. నోటీసుల పేరుతో ప్రజల దృష్టి మరల్చేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నడు. పూటకో వేషం వేస్తూ రోజుకో కుట్ర పన్నుతున్నడు. ఎన్ని నోటీసులిచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వదిలిపెట్టేది లేదు. తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు.
-కేటీఆర్
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేస్ కేసులో పదే పదే నోటీసుల డ్రామాలు ఆపి, లై డిటెక్టర్ టెస్ట్‌కు వచ్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈనెల 16 (సోమవారం)న విచారణకు రావాలని ఏసీబీ ద్వారా నోటీసులు పంపడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించిన అనంతరం ప్రకటన విడుదల చేశారు. ఫార్ములా-ఈ రేస్ కోసం హెచ్ఎండీఏ ఖాతా నుంచి పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఆ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయని స్పష్టంచేశారు. వాటిని వెనకి తెప్పించడం చేతకాని సీఎం మరోసారి ఏసీబీ ద్వారా తనకు నోటీసులు పంపారని విమర్శించారు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన ఫార్ములా-ఈ రేస్‌ను అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసి ఆ సంస్థ వద్ద ఉన్న రూ.44 కోట్ల ప్రజాధనాన్ని వెనకి తెచ్చే ప్రయత్నాన్ని ఉద్దేశపూర్వకంగా పకనపెట్టారని మండిపడ్డారు. నోటీసుల పేరుతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చట్టాన్ని గౌరవించే పౌరుడిగా వస్తా..
తనకు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా, విచారణ పేరుతో సాగదీసినా ఫార్ములా ఈ అంశం సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసునని కేటీఆర్ తెలిపారు. తాజాగా మరోసారి ఇదే అంశంలో ఏసీబీ తనకు నోటీసులిచ్చిందని తెలిపిన కేటీఆర్, చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరై అన్ని విధాలుగా సహకరిస్తానని స్పష్టంచేశారు.
లైవ్‌లో.. లై డిటెక్టర్‌కు సిద్ధమా?
పదేండ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, ఆ కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉన్నదన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఇద్దరిపైనా ఏసీబీ కేసులున్నయి.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదురొనే దమ్మూ, ధైర్యం రేవంత్‌రెడ్డికి ఉన్నదా?’ అని కేటీఆర్ సవాలు విసిరారు. ‘లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డీ’ అని ప్రశ్నించారు. ‘ఓవైపు మీ దివాలాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ముఖ్యమంత్రి అసమర్థతను చాటుకుంటున్న తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృథా చేయడం మానుకొని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని సవాల్ చేశారు.
చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏసీబీ విచారణకు హాజరవుత. విచారణకు సహకరిస్త. పదేండ్ల కింద నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉన్నది. ఇద్దరిపైనా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లై డిటెక్టర్ టెస్టును ఎదురొనే దమ్మూ, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా?
– కేటీఆర్
కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులిచ్చింది. ఈనెల 16న విచారణకు రావాలని కోరింది. ఇంతకు ముందు మే 28న కూడా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే, తనకు ముందుగానే యూకే, యూఎస్ఏలో పలు ఈవెంట్ల కోసం వెళ్లే ఏర్పాట్లు ఉండటంతో తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ ముందు హాజరవుతానని వారికి రాతపూర్వకంగా కేటీఆర్ తెలియజేశారు. ఇదే కేసులో ఈ ఏడాది జనవరి 3న నోటీసులిచ్చిన ఏసీబీ అదే నెల 6న విచారణకు పిలిచింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ ఏసీబీ విచారణకు లాయర్‌తో జనవరి 6న హాజరైతే.. లాయర్‌తో విచారణకు రానివ్వమని ఏసీబీ తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ గేటు బయటే.. లిఖితపూర్వకంగా తన సమాధానం రాసి ఇచ్చారు కేటీఆర్.
అనంతరం జనవరి 7న హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులిచ్చింది. దీంతో అప్పటికే హైకోర్టులో ఆ కేసు నడుస్తుండటంతో కేసు తేలే వరకూ రానని కేటీఆర్ చెప్పారు. దీంతో జనవరి 8న ఇచ్చిన నోటీసుల్లో 9న హాజరుకావాలని కోరడంతో జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం కేటీఆర్‌ను జనవరి 16న విచారణకు పిలిచింది. ఆయన జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.
ఫార్ములా-ఈ రేస్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సాధికారికంగా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా-ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నయి. వాటిని వెనకి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి.. మరోసారి ఏసీబీ ద్వారా నాకు నోటీసులు పంపిండు.
– కేటీఆర్