ACB Raids | వరంగల్ : రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ వద్ద ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు రూ.4.04కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం.. హైదరాబాద్, వరంగల్, జగిత్యాలలో పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. దాడుల్లో రూ.4,04,78,767 వరకు అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు.
రూ.2.79కోట్ల విలువైన మూడు ఇండ్ల దస్త్రాలు, రూ.13.57లక్షల ఓపెన్ ప్లాట్స్, రూ.14.04లక్షల విలువైన 15 ఎకరాల వ్యవసాయ భూమి, బ్యాంకు బ్యాలెన్స్ రూ.5,85,409.. గృహోపకరణాల విలువ రూ.22,85,700 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే, రూ.43.80లక్షల విలువైన వాహనాలు, రూ.19,55,650 విలువైన బంగారు ఆభరణాలు, మరో రూ.5లక్షల విలువైన ఫారిన్ లిక్కర్ బాటిల్స్‌ను డీటీసీ వద్ద గుర్తించినట్లు ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య వివరించారు. ప్రాథమికంగా డీటీసీ వద్ద అక్రమాస్తులు గుర్తించిన నేపథ్యంలో అధికారులు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.
దాడుల తర్వాత హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంప్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తీసుకువచ్చి.. పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇంటికి తీసుకెళ్లి.. అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. శనివారం వరంగల్ ఏసీబీ కోర్టులో శ్రీనివాస్‌ను రిమాండ్ చేశారు. ఈ కేసును విచారణను కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. విచారణకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీపీ ప్రకటిస్తారని అధికారులు పేర్కొన్నారు. వరంగల్ డీటీసీగా గత సంవత్సరం ఫిబ్రవరిలో పుప్పాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
అంతకు ముందు ఆదిలాబాద్, హైదరాబాద్‌లోనూ పని చేశారు. ఈ క్రమంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు పక్కా సమాచారం అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం డీటీసీ వద్ద దాదాపు రూ.4.4కోట్ల అక్రమాస్తులు గుర్తించగా.. బహిరంగ మార్కెట్లో విలువ రూ.15కోట్లకుపైగా ఉంటుందని సమాచారం. ఇంకా శ్రీనివాస్‌తో పాటు కుటుంబీకుల పేరిట ఉన్న బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉందని.. మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.