సికింద్రాబాద్, మే 23: జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్‌రావు కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్‌కు చెందిన వెంకట్రావు రెండు భవన నిర్మాణాల అనుమతులు, ఆక్యుపెన్సి సర్టిఫికెట్ నిమిత్తం జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆశ్రయించగా రూ. 8 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
విఠల్‌రావు రూ. 4 లక్షలను సఫిల్‌గూడ వద్ద తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యిందని ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు. మరో రూ. 4 లక్షల కోసం వెంకట్రావుపై ఏసీపీ విఠల్‌రావు ఒత్తిడి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. రూ. 4 లక్షలు ఇవ్వకపోవడంతో భవన నిర్మాణ అనుమతుల ఫైళ్లను తిరస్కరించినట్టు తెలిపారు. దీంతో బాధితుడు వెంకట్రావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విఠల్‌రావును ప్రశ్నించారు. మేడిపల్లిలోని ఆయన నివాసంతోపాటు నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు కోసం సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారి శ్రీధర్ వెల్లడించారు.