హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు. ముడుపులు ముట్టందే దస్త్రం కదపడం లేదు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకుని రాజభోగాలు అనుభవిస్తున్నారు.
ఇలాంటి వారిపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కొరడా ఝులిపిస్తున్నది. 2025లో ఆరునెలల్లో నమోదు చేసిన కేసులు, గుర్తించిన అక్రమాస్తుల వివరాలతో మంగళవారం నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది 126 కేసులు నమోదు చేయగా, ఒక్క జూన్ నెలలోనే 31కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే సమాచారం ఇవ్వాలని, వారిని వలవేసి పట్టుకుంటామని ప్రజలకు సూచించింది.