హనుమకొండ, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు మారలేదు. భాష మారలేదు. ఆయన నోట మళ్లీ అభ్యంతరకరమైన, అనుచితమైన భాషే వచ్చింది. ఒకవైపు జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడితే.. అదే సమయంలో పోటీగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూరపల్లిలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి అరుపులు, కేకలు, సవాళ్లతో హల్చల్ చేశారు. తన పరువు తానే తీసుకొనేలా జుగుప్సాకరమైన భాష ఉపయోగించారు. జగిత్యాలలో కేసీఆర్ సభ సక్సెస్ కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి సహనం కోల్పోయారు. కేసీఆర్ సభకు పోటీగా జరిపిన సభలో అసహనంతో ఊగిపోయారు. అధికారిక సభను రాజకీయ, పార్టీ సభగా మార్చేశారు. ఒక విధంగా చిన్న సభలో ఎన్నికల సభ మాదిరిగా ప్రసంగించారు. పూనకం వచ్చిన వ్యక్తిలా శివాలెత్తారు. అంతా తన చేతిలోనే ఉన్నట్టుగా.. కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓడించేది గెలిపించేది ప్రజలు. ఐదేండ్లకోసారి ఎవర్ని అధికారంలో, ఎవర్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలో ప్రజలే తేలుస్తారు. ఈ ప్రాథమిక విషయాన్ని మరచిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి.. అంతా తన చేతుల్లోనే ఉన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘ఘోరీ కడుతా, బొంద పెడుతా, తొక్కుకుంటూ వస్త, దుర్మార్గుడు, శత్రువు, దరిద్రుడు, పాపాల భైరవుడు, సిగ్గు, శరం…’ ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో ఉపయోగించిన ‘ఆణిముత్యాలు’! సభ ఏదైనా, ప్రాంతం ఏదైనా సరే కేసీఆర్ చావు కోరుకోవడం, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదొక్కటే సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసిన విద్య. ఇందులో భాగంగానే నస్తూరపల్లిలో ‘ఘోరీ కడుతా, బొంద పెడుతా’ అంటూ ప్రేలాపనలకు దిగారు. సీఎం చావు భాషకు కేసీఆర్ జగిత్యాల సభలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పొద్దునలేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటున్నడు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను.. నా కొడుకా.. అనుకుంటున్నవేమో..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సీనియర్ నేత జీవన్‌రెడ్డి విషయంలోనూ అనుచిత వ్యాఖ్యలే చేశారు. జీవన్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండా పెద్దాయన అంటూనే.. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే పార్టీ మారారని చెప్పుకొచ్చారు. ప్రజలు బొంద పెడితే… దుర్మార్గుడు, శత్రువుతో చేయి కలిపారని అహంకారపు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని, కాంగ్రెస్ పార్టీని దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు ఘోరీ కడుతామని, బొంద పెడుతామంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాలు చేస్తున్నానని ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంపై సభకు వచ్చిన వారి నుంచి స్పందన కనిపించలేదు. బహిరంగ సభకు ఆలస్యంగా రావడంతో జనం అప్పటికే తిరుగుముఖం పట్టిన పరిస్థితి కనిపించింది.
రైతుభరోసా పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ వాయిదాల భరోసాగా మార్చేసింది. మొదటి విడత పంపిణీ తరువాత నెల రోజులకు రెండో విడత పంపిణీ చేసిన సర్కార్.. మూడో విడత పంపిణీకి మరో నెల వాయిదా పెట్టింది. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో నిర్వహించిన ‘రైతు ఉత్సవాలు’ బహిరంగసభలో రెండో విడత రైతుభరోసా నిధులను విడుదల చేసి ప్రసంగించారు. సోమవారం రెండో విడతగా 45 లక్షల మంది రైతులకు రూ.2,063 కోట్లు విడుదల చేశారు. మూడో విడత నిధుల విడుదలను వచ్చే నెలకు వాయిదా వేశారు. మరో రెండు వారాల వరకు మూడో వాయిదా చెల్లించలేమని బహిరంగ సభలోనే స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు రూ.5,700 కోట్లు విడుదల చేశామని, మిగిలిన రూ.3,300 కోట్లు విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.