నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 14 : కృష్ణమ్మకు మళ్లీ వరద వచ్చింది. జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా అధికారులు 43 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుండగా.. అవుట్‌ఫ్లో 2,70,668 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయానికి 3,95,652 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుందగా, డ్యాం పది గేట్లను తెరిచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో 4,42,694 క్యూసెక్కులుగా నమోదైంది.
సాగర్ 20 గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్‌కు 4,42,542 క్యూసెక్కుల వరద వస్తున్నది. డ్యాం పూర్తి స్థాయికి చేరడంతో 20 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 48,320 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు 15 వరదగేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటమట్టంతో నిండుకుండలా ఉన్నదని అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 21,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.