చిన్నకోడూరు, మే 15: కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి సర్కార్ ఎంత దుష్ప్రచారం చేస్తున్నా.. అంతర్జాతీయ స్థాయిలో దాని ఖ్యాతి విరాజిల్లుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణరీతులను అధ్యయనం చేసేందుకు విదేశీ ప్రతినిధులను తరలి వస్తూనే ఉన్నారు. నానా రకాల తప్పుడు ప్రచారాలతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నప్పటికీ, నిర్మాణ సంస్థ మేఘా కంపెనీ మాత్రం అదే ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తన బ్రాండ్ ఇమేజ్ను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం. అబుదాబి ప్రతినిధులను ప్రత్యేక హెలికాప్టర్లో తీసుకొచ్చి ప్రాజెక్టు విశిష్టతలను మేఘా కంపెనీ వారికి వివరించడం విశేషం.
కాళేశ్వరం ప్రాజెక్టులో బాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్, పెద్దకోడూర్ గ్రామాల సమీపంలో నిర్మించిన రంగనాయకసాగర్‌ను అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. ఈ బృందం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేఘా కంపెనీ ప్రతినిధి ఉమామహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో రంగనాయకసాగర్‌కు చేరుకొన్నది.
అబుదాబి బృందంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ చైర్మన్ హెచ్ఈ డాక్టర్ అబ్దుల్లా హుమైద్ సైఫ్ అల్ జర్వాన్ అల్ షమ్సి, సెక్రటరీ హెచ్ఈ ఇంజి అహ్మద్ మహ్మద్ అల్ రుమైథి, సీనియర్ అడ్వైజర్ డాక్టర్ అహ్మద్ అబ్దెల్ మౌటి, అడ్వైజర్ మజీద్ బిన్ కువైట్, చీఫ్ లీగల్ కౌన్సెలర్ హమ్జా మెరౌనే బెనాబిడ్ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్, సొరంగం, సొరంగంలోని భారీ మోటర్లను అబుదాబి ప్రతినిధుల బృందం పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా కంపెనీ కీలక భూమిక పోషించింది. ప్రాజెక్టులో భాగంగా భారీ పంపుహౌస్‌లు, సొరంగ నిర్మాణాలను కంపెనీ చేపట్టింది. మేఘా కంపెనీ మనదేశంలోనే కాకుండా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోనూ పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను నిర్వహిస్తున్నది. వాటర్వెల్ రిగ్స్, డ్రిల్లింగ్, ఎనర్జీ సంబంధిత కాంట్రాక్టు పనులు చేపడుతున్నది. తాజాగా ఎనర్జీ విభాగానికి సంబంధించి అబుదాబి ప్రతినిధులను ప్రాజెక్టు సందర్శనకు తీసుకొనిరావడం విశేషం.
కాళేశ్వరం నిరర్థకమని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుండగా, అదే ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తన పేరు, ప్రతిష్టలు పెంచుకొనేందుకు మేఘా కంపెనీ ప్రయత్నిస్తుండటం గమనార్హం. దీంతో కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్న వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. ఇదిలాఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే అనేక రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. డిస్కవరి చానల్ సైతం ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రాజెక్టు విశిష్టత, నిర్మాణ కౌశలాన్ని ప్రత్యేకంగా వివరించింది.