Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ): కులవృత్తుల వారిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన బీసీబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. మరేదైనా పథకం ద్వారా ఆదుకుంటుందా? అంటే అలాంటి ఊసే ఎత్తడం లేదు. కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీకి దాదాపు రూ.4 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం రూ.750 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ నిధులను కూడా విడుదల చేయలేదు. రాష్ట్రంలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తుల బలోపేతానికి, వృత్తిదారులు ముడిసరుకులు, యంత్ర పరికరాల కొనుగోలుకు 100% సబ్సిడీతో రూ.లక్ష ఆర్థికసాయం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టగా, 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. అందులో 4.13 లక్షల మందికి అర్హులున్నట్టు గుర్తించారు. వీరిలో 40 వేల మంది కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేసింది. మిగిలిన వారికి ప్రతి నెలా 15న ఆర్థికసాయం అందించాలని, అది నిరంతరం కొనసాగించాలని అప్పటి సర్కార్ నిర్ణయించింది. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా దరఖాస్తులను పక్కనపెట్టినట్టు తెలిసింది. పథకానికకి నిధుల విడుదల వద్దని అధికారులకు సూచించినట్టు సమాచారం.
4 వేల కోట్లతో ప్రతిపాదనలు
కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బీసీబంధు పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టిన బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు.. గతంలో మాదిరిగా 60, 70, 80% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. గతంలో 2015, 2019లో బీసీ సంక్షేమశాఖ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అందులో 60% సబ్సిడీ రుణాల కోసం దాదాపు రెండు లక్షల మందికిపైగా, 70% సబ్సిడీ రుణాల కోసం 1.50 లక్షల మందికిపైగా, 80% సబ్సిడీ రుణాల కోసం లక్ష మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అనివార్య కారణాలతో దరఖాస్తుదారులకు రుణాలను మంజూరు చేయలేదు. గతంలో వివిధ సబ్సిడీల కింద రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారికే ప్రస్తుతం రుణాలను ఇచ్చేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు తెలుస్తున్నది. బీసీ సంక్షేమశాఖ ఇటీవల బీసీ కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాల కోసం రూ.4వేల కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.750 కోట్లు కేటాయించింది. వాటిని కూడా విడుదల చేయకపోవడంతో ఏవిధంగా యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులైనా విడుదల చేస్తుందా? అందులోనూ కోత పెడుతుందా? అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతమందికి రుణాలు మంజూరు చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.