నకిరేకల్/శాలిగౌరారం, అక్టోబర్ 27 : కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం నల్లగొండ జిల్లాలో ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నది. మూసీ ప్రక్షాళనకు మద్దతు కోరుతూ ఆదివారం తలపెట్టిన రైతు సమ్మేళనం కోసం శాలిగౌరారం మండలంలోని గురజాల-మనాయికుంట వద్ద మూసీ బ్రిడ్జిపై శనివారం రాత్రి సభా వేదికను ఏర్పాటుచేశారు. హెచ్చరిక బోర్డులు, లైట్లు లేకపోవడంతో రాత్రి 8 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కుడకుడకు చెందిన తూర్పాటి చరణ్ (17) బైక్‌పై వెళ్తూ స్టేజీని ఢీకొనడంతో మృతి చెందాడు. దాంతో రాత్రికి రాత్రి వేదికను తొలగించారు.
శాలిగౌరారం పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా దవాఖానకు తరలించారు. ఆదివారం కాంగ్రెస్ సభకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం హాజరవగా, బాధిత కుటుంబం సభకు వచ్చి ఎక్కడ నిరసన తెలుపుతుందోనని పోలీసులు చరణ్ మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా హాస్పిటల్‌లోని మార్చురీలో పెట్టి తాళం వేసి ఆదివారం రాత్రి వరకూ పోస్ట్‌మార్టం చేయలేదు. దాంతో బాధిత కుటుంబం దవాఖాన ఎదుట ధర్నాకు దిగింది. శనివారం రాత్రి చనిపోయిన కొడుకును ఆదివారం రాత్రి అయినా చూపించకపోవడంతో చరణ్ తల్లి గంగమ్మ తల్లడిల్లిపోయింది.