మల్లాపూర్, మార్చి 21: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు వచ్చి ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినీ స్టేడియంలో క్రీడాకారులు కలిసి నూతనంగా ఎంపీఎల్ (మండల క్రికెట్ ప్రీమియర్ లీగ్) పోటీలను కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. ఓ క్రికెట్ ప్రాంచైజీ తరఫున మల్లాపూర్ మండలం గొర్రెపల్లికి చెందిన కొంపల్లి రాజవిష్ణు (34) ఆడుతున్నాడు. దీంతో మైదానంలో క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలాడు.
గమనించిన క్రీడాకారులు వెంటనే చికిత్స నిమిత్తం మెట్‌పల్లిలోని దవాఖానకు తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. మృతుడి తల్లి కొంపల్లి సరోజ ప్రస్తుతం గొర్రెపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. రాజవిష్ణు సర్పంచ్‌కు అన్ని విషయాల్లో అండగా నిలిచి గ్రామంలో అభివృద్ధికి కృషి చేశాడు. బీఆర్ఎస్లో కీలకపాత్ర పోషించాడు. మృతుడికి భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాజవిష్ణు గుండెపోటుతో మృతి చెందడంపై ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ సంతాపం తెలిపారు. విష్ణు మృతి పార్టీకి తీరని లోటని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.