Minister Seethakka | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సోమవారం ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీసీ రిజర్వేషన్ సెగ తగిలింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భీమని నరేశ్ అనే యువకుడు కన్నాయిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో చీరెల పంపిణీ అనంతరం వస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకొని సర్పంచ్ రిజర్వేషన్లపై ప్రశ్నించాడు. సదరు యువకుడు నరేశ్ మండలంలో 11 గ్రామపంచాయతీలు ఉంటే 2వేల మంది బీసీలు ఉంటే.. 2400 మంది ఎస్టీలు, 2400 మంది ఎస్సీలు ఉన్నారని తెలిపారు. కనీసం తమకు ఒక్క బీసీలకు ఒక్క సీటు కూడా రాలేదని.. కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులను మా భుజాల మీద ఎత్తుకొని ప్రతీ క్షణం అనుక్షణం మోశామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
స్పందించిన మంత్రి రాజ్యాంగం ప్రకారం.. ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, తర్వాత బీసీలకు ఇవ్వడం జరుగుతుందంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. తమకు ఒక్కసీటైనా రావొద్దా? అంటూ ప్రశ్నించాడు. పార్టీ తరఫున 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నారని.. మా కన్నాయిగూడెం మండలంలో కనీసం ఒక్కటి అంటే ఒక్కటి కూడా రావద్దా..? మా బీసీలకు అంటూ అడుగుతుండగా ఓ కాంగ్రెస్ నాయకుడు కల్పించుకొని జనరల్ స్థానాలు వచ్చాయని అనడంతో నరేశ్ 2450 మంది ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చాయని చెబుతున్న క్రమంలో సీతక్క మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియా కింద కుదించబడ్డాయని చెబుతున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేశ్‌కు అడ్డుగా మాట్లాడడంతో నరేశ్ కాంగ్రెస్ నాయకులను మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిజర్వేషన్ల అంశంపై మంత్రి సీతక్కను ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.