కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : చేయని దొంగతనం అంటగట్టి తనను చితకబాదారని ఓ గిరిజన యువకుడు శుక్రవారం మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువకుడికి ప్రజా సంఘాలు అండగా నిలిచి మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. బాధితుడి కథనం మేరకు
వివరాలు ఇలా.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన కుతాడి కనకయ్య (35) వ్యవసాయ కూలీ (పాలేరు)గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత నెల 11న తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆయన ఇంట్లో నిద్రిస్తుండగా రామడుగు పోలీసులు వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు.
అదేరోజు కరీంనగర్‌లోని సీసీఎస్ స్టేషన్‌కు తరలించారు. మరుసటి రోజు కర్రలు, బెల్టుతో కొట్టారు. లేవలేని స్థితిలో ఉన్న కనకయ్యను అదే నెల 12న రాత్రి 10 గంటలకు ఇంటికి పంపించారు. అప్పటికే అనారోగ్యంపాలైన కనకయ్యను కుటుంబ సభ్యులు దవాఖానలో చేర్పించారు. కోలుకుంటున్న తరుణంలోనే గత నెల 26న రామడుగు పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎనిమిది మంది పోలీసులు, ఎస్సై కలిసి నేలపై బోర్లా పడుకోబెట్టి కాళ్లు కట్టేసి చేతులు, వీపుపైన నిలబడి నానా చిత్రహింసలకు గురిచేశారు. అరికాళ్లపై కర్రలు, బెల్టుతో విపరీతంగా కొట్టారు.
గత ఏప్రిల్‌లో జరిగిన గొర్రెల దొంగతనం కేసులో ఒప్పుకోవాలని తనను చిత్రహింసలకు గురిచేసినట్టు కనకయ్య వాపోయాడు. ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరించినట్టు చెబుతున్నాడు. చేయని నేరాన్ని తానెలా ఒప్పుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. శుక్రవారం తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌తోపాటు డీజీపీకి ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరాడు. రామడుగు పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, తనను రెండుసార్లు చిత్రహింసలకు గురిచేసిన ఎస్సై, కానిస్టేబుళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. బాధితుడి వెంట ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పార్థసారథి, కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ తదితరులు ఉన్నారు.