సంఖ్యా బలం లేకపోయినా అడ్డదారిలో మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ అంతులేని అరాచ కానికి పాల్పడింది. అధికార బలం, మంద బలం, పోలీస్ బలంతో రెచ్చిపోయి ప్రజాతీర్పును అవహేళన చేసింది. వాయిదా పడిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలపై పోలీసుల అండతో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయి దాడులకు దిగారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఒకే చోట ముగ్గురు ఎస్పీలు రంగంలోకి దిగి వెయ్యి మంది పోలీసులతో కవాతు నిర్వహించి స్థానికులను సైతం భయభ్రాంతులకు గురిచేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో కాంగ్రెస్ నేతలు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ సమక్షంలోనే బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. వారిని ఇష్టం వచ్చినట్టు తాకుతూ అధికార మదాన్ని చూపించారు. ఇక జనగామ కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా స్వతంత్ర అభ్యర్థి, దళిత మహిళ ఎత్తిన చేతిని ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు బలవంతంగా దింపి దౌర్జన్యం చేశారు. కులం పేరుతో దూషిస్తూ అనుచితంగా వ్యవహరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): ప్రజాతీర్పును అవహేళన చేస్తూ అడ్డదారిలో మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ అంతులేని అరాచకానికి పాల్పడింది. అధికార, మందబలంతోపాటు పోలీస్ బలగాలతో కాంగ్రెస్ గూండారాజ్‌లు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలపై, కార్యకర్తలపై దాడులకు దిగారు. మంగళవారం పలుచోట్ల చైర్పర్సన్ల ఎన్నిక సందర్భంగా నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో పోలీస్ రాజ్యా న్ని తలపించాయి. వందలు, వేల సంఖ్యలో పోలీసులను మోహరించిన కాంగ్రెస్ సర్కార్.. బీఆర్ఎస్ నేతలు, కౌన్సిలర్లను భయబ్రాంతులకు గురిచేసింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు.
అధికార కాంగ్రెస్‌కు వంతపాడుతూ విచ్చలవిడిగా లాఠీలు ప్రయోగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు పలికి అరాచకాలకు వంతపాడారు. పోలీస్ బలాన్ని ప్రయోగించి సంఖ్యాబలం లేకపోయినా చైర్పర్సన్ పీఠాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్ తెగబడింది. తొర్రూరులో ఒకేచోట ముగ్గురు ఎస్పీలు రంగంలోకి దిగి సుమారు 1,000 మంది పోలీసులతో కవాతు నిర్వహించారంటే అధికార కాంగ్రె స్ అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అధికార, ధనబలాన్ని ప్రయోగించి పలుచోట్ల అడ్డదారిలో కాంగ్రెస్ చైర్పర్సన్ పదవులు దక్కించుకోగా.. ఆ పార్టీ పప్పులుడకని చోట చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను కుట్ర పూరితంగా మరోసారి వాయిదా వేయించింది.
గడిచిన రెండు రోజులుగా రాష్ర్టాన్ని రణరంగంగా మార్చిన కాంగ్రెస్ గూండాలు.. మంగళవారం సైతం అరాచక పర్వాన్ని కొనసాగించాయి. చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీల్లో మరోసారి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పోలీసులు సైతం కాంగ్రెస్‌కే మద్దతుగా నిలువడంతో బీఆర్ఎస్కు దక్కాల్సిన 5 మున్సిపల్ చైర్పర్సన్లను ధన, బలం ప్రయోగాలతో అడ్డదారిలో ఆ పార్టీ కైవసం చేసుకొన్నది. తొర్రూరు, జనగామలోనూ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేకపోయినా అడ్డదారులు వెతుక్కున్నది. అయినా కాంగ్రెస్‌కు మెజారిటీ దక్కలేదు. చివరికి డ్రా పద్ధతిలో కాంగ్రెస్ ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పీఠాలను దక్కించుకొన్నది. క్యాతనపల్లిలో కాంగ్రెస్ నేతలు దుశ్సాసన పర్వానికి తెగించారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ సమక్షంలోనే బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లపై అసభ్యంగా ప్రవర్తించారు. వారిని ఇష్టమొచ్చినట్టు తాకుతూ వారి అధికార మదాన్ని చూపించారు. తద్వారా అడ్డదారిలో క్యాతనపల్లి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలనే కుట్రలు చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ దీటుగా పోరాడటంతో కాంగ్రెస్‌కు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోసారి చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడేలా కుట్రచేసింది.
జనగామలోనూ కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ లేకపోయినా చైర్మన్ పీఠం కోసం బరితెగింపు రాజకీయాలకు పాల్పడింది. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి రౌడీయిజం చెలాయించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. బీఆర్ఎస్కు మద్దతిచ్చిన ఇండిపెండెంట్ దళిత మహిళా కౌన్సిలర్‌పై కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడికి పాల్పడడం ఆ పార్టీ రౌడీయిజానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. బీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థికి మద్దతుగా చేతిని ఎత్తిన దళిత మహిళ, ఇండిపెండెంట్ సభ్యురాలు సందుపట్ల మంజులపై పక్క గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్ సభ్యుడు చెంచారపు కరుణాకర్‌రెడ్డి ఒక్క ఉదుటన లేచి వచ్చి దాడిచేసి ఆమె చేతిని బలవంతంగా కిందికి దింపాడు. దీంతో ఆమె గట్టిగా అరిచి మళ్లీ చేతిని పైకెత్తడంతో ఆమె వెనుక స్వతంత్రుల గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న మారబోయిన పాండు రెండోసారి ఆమెపై దాడిచేసి ఆమె చేతిని బలవంతంగా కిందికి దింపి వరుస దౌర్జన్యకాండకు పూనుకున్నారు. ఆ వెంటనే మరో కాంగ్రెస్ సభ్యుడు పాముకుంట్ల ప్రసాద్ సైతం మహిళా సభ్యురాలిపై దాడికి యత్నించినా ఆమె ప్రతిఘటించి మరోసారి బీఆర్ఎస్కు మద్దతుగా చేతిని పైకెత్తింది. దీంతో కాంగ్రెస్ అరాచకాలకు తెరపడింది. అయితే ఇద్దరికి సమానమైన మెజారిటీ రావడంతో డ్రాలో కాంగ్రెస్ గట్టెక్కింది.
రాష్ట్రంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరీని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను బీఆర్ఎస్పైకి ఉసిగొల్పినట్టు తెలుస్తున్నది. చైర్పర్సన్ ఎన్నికలు జరిగే చోట పరిస్థితులను గమనిస్తూ స్థానిక నేతలకు ఫోన్లు చేసి అరాచకానికి ప్రణాళికలు రూపొందించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చైర్పర్సన్ పీఠాలు దక్కించుకోవడంపై మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్ పెట్టారు. ఏం చేస్తారో? ఎలా చేస్తారో? తెలియదని, 90 శాతానికి పైగా చైర్పర్సన్ పీఠాలను దక్కించుకోవాలని హెచ్చరికలు జారీచేశారు. ఎవరు వచ్చినా, ఎంత అయినా సెట్ చేయండి.. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు గాలం వేయండి.. అంటూ రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో మంత్రులకు సూచనలు చేశారు. దీంతో రెచ్చిపోయిన మంత్రులు స్థానిక నేతలతో కలిసి అరాచకాలకు పూనుకున్నారు. సంఖ్యాబలం లేకపోయినా, ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ అరాచకాలకు తెగబడ్డారు.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో కంటతడి పెట్టుకుంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యుల దౌర్జన్యంపై నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే పల్లాను కదలనీయకుండా బలవంతంగా పట్టుకున్న ఏసీపీ

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి