హైదరాబాద్, జూన్ 11(నమస్తే తెలంగాణ): భూముల మార్కెట్ విలువ పెంపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎంతమేర పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఆదేశించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో, సబ్ రిజిస్ట్రార్ నేతృత్వంలో కమిటీలను సిద్ధం చేశారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎంతమేర పెంచాలో అంచనాలను రూపొందించినట్టు తెలిసింది. తాజా ఆదేశాలతో బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు మధ్య వ్యత్యాసాన్ని అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.