కాజీపేట, సెప్టెంబర్ 14: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్తు హై టెన్షన్ వైర్లు తగిలి షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్ యార్డులో జరిగింది. విరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన పస్తం రాజు (18) తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి కడిపికొండ చర్చిలో జరుగుతున్న క్రైస్తవ ఉత్సవాలకు వచ్చారు.
ప్రార్థనలు జరుగుతుండగా కొందరు పిల్లలతో కలిసి రాజు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగేందుకు రాంనగర్ సమీపంలోని సెంటింగ్ యార్డుకు వెళ్లాడు. ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగీ ఎక్కి సెల్ఫీ ఫొటో దిగుతుండగా హై టెన్షన్ విద్యుత్తు వైర్లు తగిలి షాక్‌కు గురికావడంతో శరీరం కాలిపోయి కింద పడ్డాడు. స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం దవాఖానకు తరలించారు. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.