నాగర్కర్నూల్ : కరెంట్ షాక్తో(Electric shock) ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రకల్ గ్రామానికి చెందిన మల్లేష్, లక్ష్మమ్మ దంపతుల పెద్ద కుమారుడైన లోకేష్(14) స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన లోకేష్ మూత్ర విసర్జనకు వెళ్లి పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న స్తంభానికి ఏర్పాటు చేసిన బిగు వైరును తాకాడు.
అప్పటికే దానికి కరెంటు సరఫరా కావడంతో షాక్ తో అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు కారులో నాగర్ర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కరెంటు షాక్ తో విద్యార్థి బలయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.