నమస్తే తెలంగాణ, నెట్వర్క్ : రాష్ట్రంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో వడగళ్ల వర్షం పడింది. ఇంద్రవెల్లి మండలంలో భారీ వృక్షా లు నెలకొరిగాయి. ఈశ్వర్నగర్ సమీపంలో ప్రధాన రోడ్డుపై చెట్టు విరిగి పడిపోవడంతో గంట సేపు రాకపోకలు స్తంభించాయి. ఉట్నూ ర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నిలిపోవడంతో అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సునీల్ స్థానికుల సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గంటపాటు మోస్తరు వర్షం కురిసింది.దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఉమ్మడి మెదక్ జిల్లా లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీచాయి. గజ్వేల్లో చెట్టుకింద నిలిపిన కారుపై చెట్టు విరిగిపడడంతో కారు దెబ్బతిన్నది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట నుంచి గంగారం వెళ్లే ప్రధానరహదారిపై చెట్టు విరిగిపడింది. సిరిసిల్లలోని సంజీవయ్యనగర్, నేతన్న చౌక్ లో వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్కు అంతరా యం ఏర్పడింది. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో పట్టణమంతా అంధకారం అలుముకుంది.